అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్
- వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు ఏది?
- వెయ్యి రోజులు దాటినా హామీలకు అతీగతీ లేదు: ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్‌పల్లి, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఎన్నికల ముందు వంద రోజుల్లో ఆరు గ్యా రెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం.. వెయ్యి రోజులు పూర్తవుతున్నా ప్రజల కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తి గా విఫలమైందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూకట్పల్లి లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి అధికార ంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు హామీలను పక్కనపెట్టి కాలయాపన చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకు రూ.4 వేల పెన్షన్, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. వంద రోజుల్లో సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ఇంతకాలం గడిచినా వాటి జాడ కనిపించడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఒకే కుటుంబంలో భార్యకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాత భర్తకు ఇందిరమ్మ ఇల్లు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇళ్ల కేటాయింపులు ఎలా జరిగాయో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్ల లాటరీ నిర్వహించడం ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధమని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజల తరఫున ప్రశ్నించడం తమ బాధ్యత అని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, సతీష్ గౌడ్, రవీందర్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు..






