calender_icon.png 14 January, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు అధ్వానం..!

14-01-2026 12:00:00 AM

మూడు కిలోమీటర్ల దూరం.. ముప్పు నిమిషాల ప్రయాణం 

ప్రమాదభరితంగా మారిన రోడ్డు 

ప్రభుత్వాలు, పాలకులు మారిన.. మారని రోడ్డు దుస్థితి !

అలంపూర్, జనవరి 13 : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన నేటికీ గ్రామీణ ప్రాంత రోడ్ల దుస్థితి మాత్రం మారలేదు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా.. రోడ్డు దుస్థితిని పట్టించుకునే నాధుడే కరువయ్యారని  ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చుట్టపు చూపు మాదిరి వచ్చిన నాయకులు మోసపూరితమైన హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను కన్నెత్తి చూడడం లేదనే బలమైన ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అధ్వానంగా మారిన ఈ ప్రధాన రహదారిపై నిత్యం వందల కొద్ది సంఖ్యలో వాహనదారులు, ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ.. తరచూ పలు ప్రమాదాల బారిన పడుతున్న పాలకులకు మాత్రం కనీస బాధ్యత లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించని ఈ ప్రభుత్వాలు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రోడ్లు అడుగడుగునా గుంతలు ఏర్పడి దుర్భరమయ్యాయని వాపోయారు. మూడు కిలోమీటర్ల దూరానికి ముప్పు నిమిషాలు సమయం పట్టే పరిస్థితి ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు  వాపోయారు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలని కోరుతున్నారు.

మహిళలు, గర్భిణీ స్త్రీల పరిస్థితి దుర్బరం..

చెన్నిపాడు, పెద్ద పోతులపాడు చిన్న పోతులపాడు గ్రామాలకు చెందిన ప్రజలు ఆయా పనుల నిమిత్తం నిత్యం వందల సంఖ్యలో మండల కేంద్రానికి వస్తుంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, మహిళలు, పలు ఆరోగ్య సమస్యల కారణంగా ఆటో, బైక్ వంటి తదితర వాహనాల్లో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తారు. ఈ గుంతలమయమైన రోడ్డుపై ప్రయాణం చేయలేక  నరకయాతనను అనుభస్తువిన్నట్లు వాపోయారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు సకాలంలో చేరలేక అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింద న్నారు. అదేవిధంగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం అష్టకష్టాలు పడుతూ సకాలంలో పాఠశాలలకు చేరుకోలేపోతున్నట్లు తెలిపారు. ఈ ప్రధాన రహదారిని బాగు చేస్తే మూడు గ్రామాలతో పాటు ఈ పరిసర ప్రాంత గ్రామాలన్నీ కూడా రాకపోకలకు సుమారు ఐదు కిలోమీటర్ల ప్రయాణభారం కూడా తగ్గుతుందని అన్నారు.

నరకయాతనను అనుభవిస్తున్నాం

రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణం చేయలేక నరకం అనుభవిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు ఈ దారి గుండా వెళ్లాలి అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి పాలకులు, అధికారులు స్పందించి రోడ్డును బాగు చేసేందుకు చర్యలు  తీసుకుంటే మూడు గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది.

- మధు, పెద్దపోతులపాడు గ్రామస్తుడు