calender_icon.png 27 November, 2025 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నిండా ఇసుక టిప్పర్లే.!

27-11-2025 12:58:30 AM

-అధిక లోడు, అతివేగం  ప్రమాదకర స్థాయిలో ఇసుక టిప్పర్ల వీరంగం.

-ధనార్జనే లక్ష్యంగా ఇసుక మాఫియా ఆగడాలు.

-రాజకీయ నేతల కనుసనల్లోనే అక్రమ రవాణా.

-ఇందిరమ్మ ఇళ్ళు, అభివృద్ధి పనుల పేరుతో కోట్ల దందా.

-ప్రధాన రహదారుల వెంట పొంచి ఉన్న ప్రమాదం.

-చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు.

నాగర్ కర్నూల్ నవంబర్ 26 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో దుందుభి నది జీవనదిగా పేరుగాంచింది. నిరుపేదలు ఇంటి నిర్మాణం కోసం అవసరమయ్యే ఇసుకను తక్కువ ధరకు చేరువ చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇసుక వాహనం పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ అందుకు విరుద్ధంగా ఇసుక మాఫియా భారీ హిటాచీలు టిప్పర్ల సహాయంతో అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు.  ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు సామాన్యులకు కూడా ఇసుక అందని ద్రాక్షలా మారింది.

దీనికి తోడు పరిమితికి మించిన లోడు బరువుతో కూడిన టిప్పర్లు పరిమితికి మించిన వేగంతో రాత్రి పగలు అని తేడా లేకుండా అడ్డగోలుగా రోడ్లపై ప్రయాణం చేస్తుండడంతో సామాన్య జనం వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈనెల మూడున రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుండి రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠం నేర్వకపోవడంతో జిల్లా యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కనీస అనుమతులు, నంబర్ ప్లేట్,  రేడియం స్టిక్కర్లు, ఫిట్నెస్ లేని టిప్పర్లు స్థాయికి మించిన బరువుతో కూడిన ఇసుక, కంకరను అర్హత లేని డ్రైవర్ల చేత సరఫరా చేయడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం పొంచి ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కనీసం పార్కింగ్ లైట్లు, బ్రేకులు, నాణ్యత గల టైర్లు కూడా లేని టిప్పర్లు రోడ్లపై ఏదేచ్ఛగా ఎలా తిరుగుతున్నాయని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. 

యదేచ్చగా ఇసుక దందా..!

గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దుందుభి హరివాక ప్రాంతాల్లో చుట్టూరా ఇసుక మేటలు విస్తరించాయి. ధన దాహంతో కొట్టుమిట్టాడుతున్న అధికార, ప్రతిపక్ష ఇతర ప్రజా సంఘాలకు చెందిన వైట్ కాలర్ నాయకులకు ఇసుక దందా కాసుల వర్షం కురిపిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఇసుక మేటలు తొలగించి ఇందిరమ్మ ఇల్లు అభివృద్ధి పనుల పేరుతో మైనింగ్, ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్ వంటి శాఖలకు ముడుపులప్పజెప్పి అనుమతులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వాటి పేరుతో రాత్రి పగలు అని తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దుందుభి పరివాహక గ్రామాల నుండి ఇసుక రీచ్ వరకు అక్రమంగా రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని భారీ వాహనాల సహాయంతో  సమీప గ్రామాల్లో డంపు ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి పట్టణాలకు హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ ధర 30 నుండి 40 వేల వరకు దండుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇసుక మాఫియా డబ్బు సంపాదన కోసం రవాణా వ్యవస్థతో పాటు సామాన్య జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో కూడిన ఇసుక కంకర ప్రమాదకర స్థాయిలో రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హంగామా చేయడం కాకుండా ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉన్న వాటి పట్ల శ్రద్ధ చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.