కార్యాలయాల దారి కాదిది...
వర్షం పడితే చెరువే..!
అశ్వాపురం, జూన్ 29 (విజయక్రాంతి): అశ్వాపురం మండల కేంద్రంలో ప్రజలకు సేవలు అందించే కీలక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం వర్షపు నీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, వెలుగు కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, పీఏసీఎస్, జూనియర్ కళాశాల, బీసీ హాస్టల్ వంటి ముఖ్యమైన సంస్థలకు వెళ్లే ఈ రహదారిపై కేవలం ఓ చినుకు పడితే చాలు నీరు నిలిచిపోతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.
సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రహదారిపైనే నిలిచిపోయి చిన్న చెరువులా మారుతోంది. దీంతో నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు బురద నీటిలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం పొంచి ఉండగా, నడిచి వెళ్లే ప్రజలు అడుగు ముందుకు వేయాలన్నా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే కార్యాలయాలకు వెళ్లే రహదారే ఈ స్థితిలో ఉండటంపై మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు‘ అన్నట్లు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా, వాటికి వెళ్లే దారి మాత్రం దయనీయంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రహదారికి శాశ్వత పరిష్కారం చూపించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.






