calender_icon.png 16 December, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ‘పాయె’!

16-12-2025 01:46:48 AM

  1. ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రికార్డుకు రూపాయి మారకం విలువ

రోజుల వ్యవధిలోనే మరో 26పైసలు తగ్గి 90.75 వద్ద స్థిరం

డాలర్ సూచీ 7శాతానికి తగ్గినా రూపాయి క్షీణించిన వైనం 

ఏడాదిలో డాలర్‌తో పోలిస్తే 5శాతానికి తగ్గుదల

న్యూఢిల్లీ, డిసెంబర్ 15:  భారత కరెన్సీ రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏకంగా 26 పైసలు క్షీణించి 90.75 వద్ద స్థిరపడింది. గత శుక్రవారం నమోదైన 90.55 కనిష్ట స్థాయి రికార్డును ఇది దాటింది. రూపాయి విలువ భారీగా పతనమవుతున్న క్రమంలో ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై, దేశ ఎగుమతులపై పడుతుందన్న ఆందోళనలు నెలకొంటున్నాయి. 

రూపాయి పతనాన్ని అరికట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. రూపాయి విలువ 90 మార్కును దాటడం అత్యంత కీలకం. 2011లో రూపాయికి ఉన్న విలువలో ఇప్పుడు ఇది సగం మాత్రమే. ఈ సంవత్సరం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 శాతానికి పైగా పడిపోయింది. అయితే, డాలర్ సూచీ 7 శాతం తగ్గినప్పటికీ రూపాయి మాత్రం క్షీణించడం గమనార్హం.

రూపాయి విలువ పతనం వెనుక అనేక ఆర్థిక, వాణిజ్య పరమైన కారణాలు ఉన్నాయి. ఎగుమతుల కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉండటంతో భారత వాణిజ్య లోటు విపరీతంగా పెరిగింది. దీని వల్ల డాలర్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. రూపాయి విలువ  కనిష్ఠ స్థాయి 90 రూపాయల మార్క్ దాటినా దాని ద్వారా ద్రవ్యోల్బణం, ఎగుమతులపై ప్రభావం ఉండదని సీఈఏ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది పరిస్థితి మెగురు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  సీసీఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రూపాయి విలువ తగ్గడంపై ఈ వ్యాఖ్యలు చేశారు. రూపాయి పతనం కొనసాగితే, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.