బోండి బీచ్‌లో కాల్పులు ఉగ్రదాడే!
- దారుణానికి పాల్పడింది తండ్రీకొడుకులే
- దుండగులకు ఐఎస్‌ఐఎస్‌తో లింకులు
సిడ్నీ, డిసెంబర్ 15: ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఆదివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం విదితమే. హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్‌లు విచక్షణ రహితంగా కాల్పులు జరపగా 16 మంది మృతి చెందగా మరో 40 మందికి తీవ్ర గాయా లయ్యాయి. దాడి చేసిన వారు పాకిస్థాన్‌కు చెందిన వారని కొద్దికాలం కితమే ఆస్ట్రేలియాకు వలస వచ్చారని పోలీసులు తెలిపారు.ఆ ఇద్దరు సాయుధులను తండ్రీ కొడుకులుగా దర్యాప్తు బృందం గుర్తించింది. వీరిని 50 ఏండ్ల సాజిద్ అక్రమ్, 24 ఏండ్ల నవీద్ అక్రమ్ అని దర్యాప్తు బృందం అధికారులు తెలిపారు.
వీరికి ఉగ్రవాద సంస్థ ఇస్లా మిక్ స్టేట్ ఆఫ్‌ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్)తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల కారులో రెండు ఐసిస్ జెండాలు, ఘటనా స్థలం నుంచి రెండు ఐఈడీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దర్యాప్తులో భాగంగా సిడ్నీ శివార్లలోని బోనీరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లో ఉన్న రెండు ఇళ్లపై దాడులు చేసి సోదాలు జరిపామని పొలీసులు తెలిపారు. కాగా పోలీసులు జరిపిన ఎదురుదాడిలో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీద్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాజిద్ పేరిట 2015 నుంచి తుపాకీ లైసెన్స్ ఉన్నట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు.
నా ప్రాణం పోతుంది.. మా కుటుంబానికి చెప్పండి
ఉగ్రవాదిని ఎదుర్కొనే ముందు స్థానికుడి మాటలు
ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో యూదులపై ఉగ్రవాదుల దాడి ఘటన వేళ ఓ హిరో వారిని ఎదుర్కొనేందుకు ముందుకు వచ్చాడు. అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి ఉగ్రవాదులకు ఎదురొడ్డాడు. తెగువను ప్రదర్శించి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు. యావత్ ప్రపంచం దృష్టిలో అహ్మద్ రియల్ హీరో అయ్యారు. ఉగ్రవాది చేతిలోని తుపాకీ లాక్కుని అతడికే గురిపెట్టాడు.
ఉగ్రవాదితో జరిగిన పెనుగులాట అహ్మద్ భుజంలోకి, కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ, అంతకముందు కాల్పులు జరిగిన చోట.. ‘నా ప్రాణం పోతుంది.. మా కుటుంబానికి ఈ విషయం తెలియజెప్పండి’ అని అహ్మద్ చెప్పడం చూపరులను కంటతడి పెట్టించింది. అతడు ప్రాణాలతో బయటపడటంతో అక్కడి అధికారులు ఊపిరి పీలుకున్నారు.




