3 May, 2026 | 2:05 AM

తెరపైకి సెంటిమెంట్ అస్త్రం!

03-05-2026 12:00 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మూడు పర్యాయాలు జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ సెం టిమెంట్, రాజకీయ పార్టీల హామీలు, ప్రభు త్వ వైఫల్యాలు తదితర అంశాలు ఆయా పార్టీల జయాపజయాల్లో ప్రధాన పాత్ర పోషించాయి. తెలంగాణ తెచ్చిన పార్టీగా  బీఆర్‌ఎస్‌కి రెండు పర్యాయాలు పాలించే అవకాశం దక్కితే, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కి ఒకసారి అవకాశం దక్కింది. అలా గే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన బీజేపీకి కూడా ఒక అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ ఆశిస్తోంది.

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా రాజకీయ పార్టీలు తెలంగాణ భావోద్వేగాన్ని, ఉద్యమాన్ని విస్మరించి రాజకీయంగా ముం దుకువెళ్లలేని పరిస్థితి. 2023 శాసనసభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అంశంతో పాటు దశాబ్దం పాటు సాగిన బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలు కూడా ప్రధాన ఎజెండాగా మారి పార్టీల గెలుపోటములను ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. అయితే, కొంతమంది పదేళ్ల తర్వాత కూడా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో తెరపైకి వచ్చిన ‘జై బంగ్లా’ నినాదం లోకల్ సెంటిమెంటుని రగిలించడమే వారికి సమాధానమని చెప్పాలి. భవిష్యత్తులోనూ తెలంగాణ రాజకీయాలలో ‘జై తెలంగాణ’ నినాదాలు వినిపిస్తాయని, తెలంగాణ సెంటిమెంట్ కనిపిస్తుందని చె ప్పేందుకు బెంగాల్ ఉదంతం ఉదాహరణ గా నిలుస్తోంది. అయితే, తెలంగాణ సెంటిమెంట్‌తో పాటు తెలంగాణకు ఇచ్చిన హామీ లు, ప్రభుత్వ వైఫల్యాలు కూడా ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

ఇటీవల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా చట్టసభలలో మహిళలకి రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు దు మారం రేపాయి. ప్రధాన ప్రతిపక్ష నేత, మా జీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కనీ సం నోరుమెదపలేదని, బీఆర్‌ఎస్ సభ్యులు ఉండి ఉంటే పార్లమెంట్ అట్టుడికిపోయేదని చెప్తూ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు.

అంతకుముందు జగిత్యాల సభలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై, ప్ర భుత్వ వైఫల్యాలపై విమర్శలతోపాటు తెలంగాణ ఆగమైపోతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర రాజకీయాల లో తెలంగాణ సెంటిమెంట్, ప్రభుత్వ వైఫల్యాలు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారబో తున్నాయని విస్తృతమైన చర్చ జరుగుతోంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఒక దశాబ్దం తరువాత కూడా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏమిటి? ఇంకా సెంటిమెంట్‌ని రాజ కీయ అవసరాలకి వాడుకుంటారా? అని సన్నాయి నొక్కులు నొక్కే వారు కూడా ఉ న్నారు. కానీ, తెలంగాణ అనేది రాష్ట్రం పేరు మాత్రమే కాదు, ఈ ప్రజల భావోద్వేగం, ఆకాంక్ష, ఆ పదంతో ప్రజలకి ముడిపడిన పేగుబంధం. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు ప్రశ్నించినా, విమర్శించినా, హేళన చేసినా, కించపరిచే విధంగా తేలికగా మాట్లాడినా తెలంగాణ సమాజం జీర్ణించుకోలేదు. అందుకే రాష్ట్ర విభజనను దేశ విభజనతో పోలుస్తూ పార్లమెంట్‌లో తేజస్వి సూర్య చేసి న వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనసులను గాయపరిచాయి. తెలంగాణ ఏర్పాటుని దేశ విభజనతో పోల్చుతారా? అనే అభ్యంతరాలు తెలంగాణ సమాజం నుంచి వ్యక్త మైంది.

మరొకవైపు ఆంధ్ర విశ్వవిద్యాల యం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘హైదరాబాద్ నుంచి మనల్ని మెడపట్టి బయటకి గెం టివేశారు’ అని మాట్లాడటాన్ని కూడా తెలంగాణ ప్రజలపై సమైక్యవాదుల దాడిగానే ప్ర జలు భావిస్తున్నారు. ‘రాజాజీ గెంటివేస్తే నిలువ నీడలేని వారికి హైదరాబాద్‌లో ఆశ్ర యం కల్పించిన సహృదయం తెలంగాణ ప్రజలది. రాష్ట్ర విభజన తర్వాత కూడా పది సంవత్సరాలు ఆశ్రయం కల్పించే హామీ ఇచ్చినా వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయి నేడు నింద లు వేస్తారా! కళ్ల ముందు జరుగుతున్న చరిత్రను వక్రీకరిస్తారా?’ అనే అభ్యం తరాలు వ్యక్తమవుతున్నాయి. 

‘తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కోనసీమలోని పచ్చని కొబ్బరి చెట్లు మొదళ్లతో సహా ఎండిపోయాయి’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య లు, లోక్‌సభ సాక్షిగా దేశం మొత్తం చూస్తుండగా తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు తెల ంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయని చెప్పక తప్పదు. హైదరాబాద్‌పై మమకారం వదులుకోలేని సమైక్యవాదులు హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని నర్మగర్భంగా పలికే పలుకులు తెలంగాణపై జరగబోయే దాడిగానే పరిగణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తేజస్వి సూర్య మాట్లాడిన మాటలకు బీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగాన్ని తలపించేవారేనని కేసీఆర్ చెప్పడం, తెలంగాణ ఇచ్చే సమయంలో తనను మానసిక వేదనకి గురిచేశారనే మాటలు మరొకసారి తెలంగాణ సెంటిమెంటుని తెరపైకి తెచ్చే ప్రయ త్నంగానే కనిపిస్తున్నాయి.

వైఫల్యాలను ఎండగట్టే ఎత్తుగడ               

కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి తెలంగాణ సెంటిమెంట్‌తో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలలోకి తీసుకుపోవాలనేది బీఆర్‌ఎస్ ఎత్తుగడగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయకపోవడం, ముఖ్యంగా మహిళలకు రూ.2500, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచకపోవడం, రైతు, బీసీ, ఎస్సీ, యూత్ డిక్లరే షన్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం తదితర వైఫల్యాలను ప్రజలలోకి బలంగా తీసుకపోవాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.

అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోనే సభ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకుపోవాలని ప్రయత్నిస్తోంది. మహిళలకు స్కూ టీలు, తులం బంగారం ఎక్కడ? రైతులకు రైతు భరోసా సకాలంలో ఎందుకు ఇవ్వటం లేదు, ధాన్యం కొనుగోలులో జాప్యం ఎందు కు? అంటూ ప్రశ్నిస్తూనే, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.

కాంగ్రెస్, బీజేపీ ఎంపీలను గెలిపించినా విభజన చట్టంలో పొం దుపరిచిన హామీలు, ప్రత్యేక నిధులను సాధించడంలో రెండు పార్టీలు వైఫల్యం చెందాయనే విషయాన్ని ప్రజలలోకి తీసుకుపోవటానికి ప్రధాన ప్రతిపక్షం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల లోకి బలంగా తీసుకపోవటానికి పార్టీని పునర్ వ్యవస్థీకరించే దిశగా ఇప్పటివరకు ఉన్న కార్యవర్గాలను రద్దుచేసి, పార్టీని క్షేత్రస్థాయి వరకు నిర్మాణం చేయాలని భావి స్తున్నట్లుగా కనపడుతోంది. 

ఇటు ధీమా.. అటు శపథం 

‘ఈసారి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నూటికి నూరు శాతం గెలిచేది మనమే’ అని బీఆర్‌ఎస్ అధినేత ధీమా వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వనని ముఖ్యమంత్రి శపథం చేస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే లోక్‌సభ ఎన్నికల దారుణ పరాజయం నుంచి బీఆర్‌ఎస్ బయటపడుతున్నట్లుగానే కనిపిస్తోంది. కానీ, అధికార పార్టీ గెలుపుని అడ్డగించే స్థాయిలో బీఆర్‌ఎస్ ఇంకా పుంజుకోలేదన్నది వాస్తవం.

ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు రాబోయే శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ మరోసారి గెలుస్తుందా? 2034 వరకు అధికా రంలో ఉండగలుగుతుందా? అనే ప్రశ్నలకు భవిష్యత్తు రాజకీయ పరిణామాలే సమాధానం చెబుతాయి. రాజకీయాలలో ఒట్టు తీసి గట్టు మీద పెట్టే నాయకులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి పొత్తు పెట్టుకోబోమని ఏ నాయకుడు మాత్రం ప్రజలకు హామీ ఇస్తా డు. ఎవరు ఎవరితో కలిసి పోటీచేస్తారో అ ప్పటి రాజకీయ పరిణామాలే నిర్ణయిస్తాయి.

వ్యాసకర్త సెల్: 9885465877 

డా. తిరునహరి శేషు