08-12-2025 08:07:50 PM
వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి
హనమకొండ టౌన్ (విజయక్రాంతి): హైదరాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యాలయంలో పలు జిల్లాల జిల్లా చైర్మన్లు, రాష్ట్ర పాలకవర్గ సభ్యుల సమక్షంలో రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా చైర్మన్లు, పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రక్తదానం సహా మానవతా సేవల్లో రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న విశేష సేవలను కొనియాడారు. అనారోగ్య అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చే సహాయం అమూల్యమని పేర్కొన్నారు.
అంతేకాకుండా రాష్ట్ర పాలకవర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారులు నియామకాలపై ముఖ్యమంత్రితో చర్చించి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు తక్షణం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లా చైర్మన్లు, పాలకమండలి సభ్యులను త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో అవసరమైన చోట్ల రెడ్ క్రాస్ సొసైటీలకు భూ కేటాయింపు, నూతన భవనాల నిర్మాణం వంటి అంశాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో వివరించనున్నట్లు తెలిపారు.
తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నెలసరి ఆర్థిక సహాయ పథకం అమలు జరగేందుకు ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ క్రాస్ సేవలు మరింత బలోపేతం కావాలనిఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ప్రత్యేకంగా సత్కరించి, నిర్వాహకులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, తోట రాజశేఖర్, కె. ప్రసాద్ రావు, జనార్దన్ రావు, మహేందర్ రెడ్డి, జిల్లా చైర్మన్లు గోలి అమరేందర్ రెడ్డి, ఎం. రాజేశ్వర్ రావు, మామిడి భీమ్ రెడ్డి, సాయి చౌదరి, భాస్కర్ రెడ్డి, వనజ రెడ్డి, వరప్రసాద్, కేశవ రెడ్డి, గంగేశ్వర్, సుదర్శన్ రెడ్డి, ఆంజనేయులు, రాజన్న, కోటేశ్వరి, రాధాకృష్ణ, విజయ్ , సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.