18-02-2026 12:58:14 AM
ములుగు అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ
ములుగు, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను కొనసాగించాలని కోరుతూ ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల (సిసిఎల్‌ఏ) కార్యాలయం నుంచి జారీ చేసిన మెమో ప్రకారం టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను నిలిపివేయాలని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఈ వినతి కా ర్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 632 మంది టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తుండగా, ములుగు జిల్లాలో 11 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
గత ప్రభుత్వాల కాలంలో నియమించబడిన వీరు ఎన్నో సంవత్సరాలుగా రెవెన్యూ శాఖ లో నిరంతరాయంగా సేవలు అందిస్తూ శా ఖ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు. భూ రికార్డుల నిర్వహణ, ఆదాయ ధృవపత్రాల జారీ, వివిధ ప్రభుత్వ పథకాల అమలు వంటి కార్యక్రమాల్లో తమ సేవలు ముఖ్యమని పేర్కొన్నారు. తమలో చాలా మంది వయోపరిమితి దాటిపోవడం తో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం తమ కుటుంబాల జీవనోపాధి పూర్తిగా ఈ ఉద్యోగంపైనే ఆధారపడి ఉందని విన్నవించారు.
సేవలు నిలిపివేస్తే తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి తమ సేవలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ను కోరారు.
ఈ కార్యక్రమంలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, అన్నపూర్ణ, ప్రశాంత్, రవి, సాయి గౌతమ్, నరేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.