‘వెండి కొండ’ ధగధగ
కిలో ధర రూ.2.39 లక్షలు
హైదరాబాద్, డిసెంబర్ 30: అంతర్జాతీయ మార్కెట్ లో వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న వెండి.. రోజుకొక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నది. సోమవారం భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ పైకి లేచాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2.30 లక్షలు దాటగా..10 గ్రాముల బంగారం ధర 1.38 లక్షల పైనే పలికింది. ద్రవ్యోల్పణం, ఆర్థిక హెచ్చుతగ్గులు లాంటి వివిధ సవాళ్ల కారణంగా వెండి, బంగారం తరచూ వాటి విలువను పెంచుకుంటున్నాయి.
కమోడిటీ ఎక్సేంజీల్లో వెండి మార్చి ఫ్యూచర్స్ కాంటాక్టు ధర సోమవారం కిలోకి రూ.2,24,855 వద్ద స్థిరపడింది. ఈ ధర మంగళవారం నాలుగు శాతానికిపైగా రూ.2.34 లక్షల వద్ద ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం కేజీ వెండి రూ.2.39లక్షలుగా ఉంది. కాగా సోమవారం ఈ ధర రూ.2.28 లక్షల వరకు పతనమైంది. బంగారం 2026 ఫిబ్రవరి ఫ్యూచర్స్ కాంటాక్టు ధర సోమవారం 10 గ్రాములు రూ.1,34,887 వద్ద ముగిసింది. నేడు0.61 శాతం పెరిగి రూ.1.35 లక్షలు ఉంది.హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1.38 లక్షలు పలికింది.




