calender_icon.png 19 December, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సర్’ పంచాయితీ!

12-12-2025 12:00:00 AM

ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై చర్చకు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. అయితే సభా సమయం వృధా కాకూడదన్న ఉద్దేశంతో కేంద్రం రెండు రోజులు (డిసెంబర్ 9, 10 తేదీల్లో) ‘సర్’పై చర్చకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో బుధవారం లోక్‌సభలో ‘సర్’పై జరిగిన చర్చ వాడీవేడీగా సాగింది. దేశంలో ఎన్నికల ప్రక్రి య ప్రారంభమైన నాటి నుంచి ఓటర్ల జాబితాలపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

నిజానికి అధికారంలో ఉన్న పార్టీలు ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఆరోపణలు చేసినప్పుడు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న మన భారత్‌లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటే రాజకీయ పార్టీలు నోరు మెదపవు.

అదే వ్యతిరేకంగా వస్తే మాత్రం ఓటర్ల జాబితాలపై నానా రభస చేస్తుండడం సహజమే. ఒకప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాం లోనూ ఓటర్ల జాబితా అవకతవకలపై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేజీ ఆరోపణలు చేసినప్పుడు కాంగ్రెస్ పట్టించుకోలేదు. తాజాగా అధికారంలో ఉన్న బీజేపీ అదే వైఖరిని అనుసరిస్తోంది. అయితే ఓటర్ల జాబితా సవరణ అంశం ఇప్పటిదైతే కాదని, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే 1952, 1957, 1961లోనే ‘సర్’ను చేపట్టినట్లు అమిత్ షా పేర్కొన్నారు.

ఆ తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాజ్‌పేయి, మన్మోహన్‌ల హయాంలోనూ ‘సర్’ను చేపట్టారని గుర్తు చేశారు. అప్పుడు ఏ పార్టీ కూడా ‘సర్’ను వ్యతిరేకించలేదని తెలిపారు. భారత్‌కు స్వాతంత్య్రానంతరం ఎక్కువకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పాలనలోనే అధికంగా ‘ఓట్ చోరీ’ జరిగిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. ఓట్ చోరీకి సంబంధించి తన వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని, మరి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

కానీ అమిత్ షా మాత్రం రాహుల్ మాటలను లెక్కచేయనట్లుగా అనిపించింది. నాయకత్వం లోపం వల్ల కాంగ్రెస్ ఓడిపోతుంది తప్ప ఈవీఎంలు, ఓట్ చోరీ వల్ల కాదని అమిత్ షా స్పష్టం చేశారు. ‘సర్’ ప్రక్రియ ద్వారా అక్రమంగా మన దేశంలో చొరబడినవారి ని గుర్తించి వారిని దేశం నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడ ఎన్నికల జరిగినా, దొంగ ఓట్లు పడడం ఎప్పటినుంచో జరుగుతున్నదే.

దొంగ ఓట్లు తొలగించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను చేపట్టింది. ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపిన ప్రతీసారి ఆయా పార్టీలను, వ్యక్తులను పిలిచి వారి సందేహాలను ఈసీ నివృత్తి చేసింది.

మరోవైపు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘సర్’ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగాలని ఇటీవలే  సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సహకారం లేకున్నా, బీఎల్‌వోలు అడ్డుకున్నా తమ దృష్టికి తేవాలని తెలిపింది. మొత్తంగా ‘సర్’పై జరిగిన చర్చలో భాగంగా ఇరు పక్షాల వాద, ప్రతివాదనలతో సభా సమయం వృధా అయ్యింది తప్ప పంచాయితీ మాత్రం తెగలేదు.