03-12-2025 12:00:00 AM
అధిక లోడ్‌లతో రహదారుల విధ్వంసం అంతకు అంత పెరుగుతున్న రాళ్ల డంపు
మళ్లీ ప్రమాదాలు సంభవించే అవకాశం
ఎన్‌ఎస్పీ కాలవను సైతం ఆక్రమిస్తున్న వైనం
మాకు ఈ క్వారీ వద్దని గిరిజనులు. పట్టించుకోని అధికారులు
కోదాడ, డిసెంబర్ 2 : మండలంలోని నల్లబండగూడెం గ్రామ పరిధిలోని మిడ్ వేస్ట్ గ్రానైట్ అనుసరిస్తున్న విధానాలతో చుట్టూ పరిసర గ్రామాలు, తండాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొద్దూగూకగానే క్వారీల్లో నిత్యం జరిగే భారీ పేలుళ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. ఈ పేలుళ్ల తో ఉత్పన్నమయ్యే ప్రకంపనలు కేవలం చెవులనే కాక, భూమిని కూడా కంపింపజేస్తున్నాయని..
ఇళ్లు కదులుతున్నాయని, గోడలకు పగుళ్లు వస్తున్నా యని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు భయపడి మానసిక ఒత్తిడికి గురవుతున్నామని కొత్తగూడెం, చిమిర్యాల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం మోత..
మిడ్ వెస్ట్ క్వారీల్లో సాయంత్రం కాగానే మొదలయ్యే బాంబుల మోతతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చీకటి పడగానే మొదలయ్యే ఈ పేలుళ్లు నిత్యకృత్యంగా మారడంతో క్వారీ చుట్టూ గ్రామా లు, తండాల ఆందోళనతో గడుపుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా క్వారీ కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. వాటితో పాటు సమస్యలు కూడా విపరీతంగా పెరిగాయని స్థాని కులు వాపోతున్నారు. రాత్రి పేలుళ్లు జరుగుతుండడంతో తమ రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీటలు వారుతున్న గోడలు...
ఈ క్వారీలో జరుగుతున్న పేలుళ్ల తీవ్రతతో నల్లబండగూడెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సాయిబాబా దేవాలయం సైతం పగుళ్లు ఏర్పడ్డాయి.. గుడిపై భాగంలో పగుళ్లు రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది భక్తులు క్వారీ తీరును ప్రశ్నించడంతో, ఆ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు గుడి కమిటీ వారి వద్దకు వెళ్లి మీడియాకు ఈ విషయం ఎక్కడ చెప్పవద్దని బ్రతిమిలాడుకున్నట్లు సమాచారం.
పగుళ్ల దాటికీ ఇళ్లలో ఉన్న వస్తువులు కింద పడుతున్నాయి. ప్రతి రాత్రి మా ఇళ్లు భూకంపం వచ్చినట్లు కదులుతున్నాయి. గోడలు బీటలు వారుతున్నాయి. ఇంట్లో ఉన్న గ్లాసులు, ప్లేట్లు కింద పడి పగిలిపోతున్నాయని కొత్తగూడెం గ్రామానికి చెందిన ప్రజలు చెబుతున్నారు. . చిన్నపిల్లలు, వృద్ధులు ఈ శబ్దాలకు భయపడి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, రాత్రి నిద్ర కూడా కరువవుతోందని పలువురు వాపోతున్నారు. పేలుళ్ల సమయంలో పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నారని తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోరు బావులకు ప్రమాదం..
క్వారీల్లో జరుగుతున్న భారీ బాంబు పేలుళ్లతో అందరికంటే రైతులు తీవ్ర ఆందోళ న చెందుతున్నారు. పేలుళ్ల ధ్వని కాలుష్యం, ప్రకంపనలు కేవలం ఇళ్లకు పగుళ్లు సృష్టించడమే కాదు. భూగర్భంలో మార్పులు తెచ్చి బోరు మోటారు బావులను కూల్చివేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని బోరు బావులు దెబ్బతిని కూడుకుపోయాయని దీనివల్ల వేసవిలో తాగునీరు, వ్యవసాయానికి నీరు కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేలుళ్లతో భూమి లోపల పగుళ్లు ఏర్పడి, మట్టి, రాళ్లు బోరు బావి లోపలికి కూరుకుపోతున్నాయని, కొన్ని బావుల్లో కేసింగ్ పైపులు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా..
కాలుష్యం ఒకవైపు.. ప్రకంపనలు మరో వైపు.. ప్రజల జీవితాలను నరకప్రాయంగా మార్చాయని గ్రామస్తులు అంటున్నారు. క్వారీ నిర్వాహకులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం బాంబులను పేలుస్తున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిమితికి మించి పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారని, ఇది భూమికి, పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు. సాగు భూముల పై కూడా కాలుష్యం ప్రభావం చూపుతుందని దుమ్ము, ధూళి పంటలపై పడి, వాటి ఎదుగుదలను అడ్డుకుంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని అధికారులు!
కొన్ని ఏండ్లుగా ప్రకృతిని విధ్వంసం చేస్తూ కోట్లు గడిస్తున్న మిడ్ వెస్ట్ గ్రానైట్ యాజమాన్యం తమ సామ్రాజ్యాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు 9.87 హెక్టార్‌ల విస్తరణ పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని క్వారీలో రెండు నెలల క్రితం ఏర్పాటు చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి నాటి జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో నడిచింది.
ప్రజాభిప్రాయ గతంలో క్వారీ ఏర్పాటు సమయంలో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, మీ గ్రామాలను అభివృద్ధి చేస్తామని నమ్మించి మమ్మల్ని నట్టేట ముంచారని ఇప్పుడు అభివృద్ధి మాట దేవుడెరుగు బ్లాస్టింగ్ దాటికి ప్రతిరోజు రాత్రి బికు, బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నామనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి. మా జీవనం అస్తవ్యస్తంగా మారిందని అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని అధికారులు వారిచే మామూళ్ల మత్తులో తూగుతున్నారని స్థానికుల ద్వారా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెరుగుతున్న రాళ్ల డంపు!
క్వారీలో వేస్టేజ్ రాళ్లను డంపు అంతకు అంత పెరుగుతుంది. క్వారీ వెనక వైపున పెద్ద గుట్టగా ఏర్పడి. పాలేరు వాగు నుండి వచ్చే వరద నీరు వెడల్పుగా ప్రవహించేందుకు వీలు లేకుండా పోయిందని స్థానికుల ద్వారా తెలుస్తుంది. అయితే దీని కారణంగానే గత ఏడాది సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాలకు నీరు ప్రవహించేందుకు వీలు లేకపోవడంతో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతం వద్ద జాతీయ రహదారి కోతకు గురి అయిందనేధి ఈ ప్రాంత వాసులు చెప్పిన మాట. ఆ సమయంలో వందల ఎకరాలలో పంట నష్టం జరిగిన విషయం అందరికి తెలిసిందే.
గతంలో రైతులు, స్థానికులు క్వారీ నిర్వాహకులను ఇలా ఎందుకు డంప్ చేస్తారని ప్రశ్నిస్తే మా భూమీలోనే చేసుకున్నామని సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఆ డంప్ మరింత పెరిగింది తప్ప తొలగించలేదు. మరల భారీ వర్షాలు కురిస్తే మళ్లీ తీవ్ర వరదలతో జాతీయ రహదారి మళ్లీ భారీగా కోతకు గురవుతుందని, పంటలు నష్టపోతామని స్థానికులు ఆరోపిస్తున్నారు.
డబ్బులతో మేనేజ్...!
ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో చాలామంది రైతులు క్వారీ విస్తరణను వ్యతిరేకించినప్పటికీ కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకు డబ్బులు ఇచ్చి క్వారీకి అనుకూలంగా చెప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చిన్న అన్యాయం జరిగితేనే ప్రశ్నించే పలువురు సోషల్ మీడియా మేధావులు సైతం సైలెంట్ అయిపోయారు. క్వారీ నిర్వాహకులు డబ్బుతో వాళ్ల నోళ్లు మూయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం లేకుండా పోయిందంటూ గ్రామస్తులు చెబుతుండడం గమనార్హం.
బాంబ్ బ్లాస్ట్ తో బావిలో నీళ్లు ఇంకిపోతున్నాయి..
మిడ్ వేస్ట్ క్వారీలో బాంబ్ బ్లాస్ట్ లు బాగా జరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ బావులన్నీ బూడుతున్నాయి. బావిలో నీళ్ళని ఇంకిపోతున్నాయి. పంట పొలాలకు భారీ నష్టం జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. రెండు నెలల క్రితం భారీ బాంబ్ బ్లాస్ట్ కు పొలంలో కలుపుతీస్తున్న మహిళల కొద్దిపాటి దూరములో గ్రానైట్ రాయి పడ్డది. ఇది రెండోసారి కావడంతో పొలంలో పనిచేయడానికి కూలీలు సైతం రావడానికి భయపడుతున్నారు.
- బానోత్ మున్ని , రైతు ఆవేదన
పంట పొలాలు దెబ్బతింటున్నాయి
మా మంగలి తండా గ్రామానికి 300 మీటర్ల దూరంలో ఉన్న మిడ్ వెస్ట్ గ్రానెట్ వల్ల గ్రామానికి, మా పంట పొలాలకు చాలా సమస్యలు వస్తున్నాయి. గ్రామం నుండి ఎన్ హెచ్ వరకు ఉన్న రోడ్డు మిడ్ వేస్ట్ గ్రానెట్ భారీ లారీలు అధిక రవాణా వల్ల రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది, భారీ వాహనాలు రోడ్డు మీద వెళ్ళటం వల్లన ప్రమాదాలు జరుగుతున్నాయ.
- దారావత్ వీరు, గ్రామస్తుడు.