08-01-2026 12:26:21 AM
శేరిలింగంపల్లి, జనవరి 7 (విజయక్రాంతి): క్రీడల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తోందని శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్కుమార్ యాదవ్ అన్నారు. గచ్చిబౌలిలోని బాలయోగి క్రీడా స్టేడియంలో తెలంగాణ భారతీయ యుద్ధకళయోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అఖిల భారత భారతీయ యుద్ధకళయోగ సమాఖ్య సహకారంతో నిర్వహిస్తున్న జాతీయ 26వ భారతీయ యుద్ధకళయోగ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
స్క్వేర్ ఆకార కదలికలు, యోగ భంగిమలు, యుద్ధకళా నైపుణ్యాల సమ్మేళనంగా రూపొందిన ఈ భారతీయ యుద్ధకళయోగ క్రీడలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అనిల్కుమార్ యాదవ్ విజేతలకు బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా విద్యార్థులను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తిక్, యువజన నాయకులు మహేందర్, మహేష్, వినోద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.