16-12-2025 01:30:08 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 7.2 అడు గుల కాంస్య విగ్రహాన్ని సోమవారం మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు, మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. కొద్దిరోజులుగా సాగుతున్న వివాదాలు, తెలంగాణ ఉద్యమకారుల నిరసన హెచ్చరికల నడుమ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ ఉడయార్ చేత తయారు చేయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తాను గతంలో నెల్లూరివాడ్ని.. ఇప్పుడు తెలంగాణవాణ్ని.. ఇక్కడే ఉంటున్నాను.. పోయేది కూడా ఇక్కడే అని వెంకయ్యనాయుడు అన్నారు. ఎస్పీబీతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ‘బాలు గళం సంగీత దర్శకుడు కోరు కున్నది ఇచ్చే అక్షయపాత్ర లాంటిది. ఆయన గొంతులో నవరసాలు నాట్యం చేసేవి. కానీ, దేవుడు చాలా స్వార్థపరుడు.
మనకు ఆనందాన్ని పంచే వారిని ఆయన త్వరగా తన దగ్గరకు తీసుకెళ్తున్నాడు. ముందు ఘంటసాలను, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యంను తన ఆస్థానంలో పాటలు పాడించుకోవడానికి తీసుకుపోయాడు. బాలు లేని లోటు పూడ్చలేనిది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఘం టసాల విగ్రహం పక్కనే బాలు విగ్రహం ఉం డటం సముచితమని, ఇది తెలుగు పాటకు పట్టాభిషేకం లాంటిదని కొనియాడారు.
తెలుగు పాటకు ఘంటసాల, ఎస్పీ బాలు పట్టం కట్టారు. సినీ చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఆయన తెలుగు ఉచ్ఛారణ వింటుంటే ఎంతో ఆనందంగా ఉండేది అని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల పేర్లను క్లుప్తీకరించి పిలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పేర్లను ముక్కలు చేయొద్దు
పేర్లను ముక్కలు చేసి పిలవడం వల్ల అందులో ఉండాల్సిన అసలైన భావం, గౌర వం తగ్గిపోతున్నాయి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని టీజీ అని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏపీ అని పిలుస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యంను ఎస్పీబీ అని, మహాత్మా గాంధీ రోడ్డు ను ఎంజీ రోడ్డు అని అంటున్నారు. దయచేసి ఇలా పేర్లను ముక్కలు చేయకండి. తెలం గాణ అని నిండుగా పిలవండి. ఆంధ్రప్రదేశ్ అని పూర్తిగా అనండి. అప్పుడే ఆ పేర్లకు నిజమైన గౌరవం దక్కుతుంది’ అని హితవు పలికారు. ‘ఇప్పుడు మమ్మీ, డాడీ అనే సంస్కృతి వచ్చింది. అమ్మ అనే పిలుపులో వచ్చే ఆత్మీయత, అనురాగం మమ్మీలో రాదు. అది కేవలం మూతి నుంచి వచ్చే మా ట.. అమ్మ అనేది గుండె లోతుల్లోంచి వచ్చే మాట’ అని వెంకయ్య నాయుడు వివరించా రు. మన భాషను, మన సంస్కృతిని, మన వాళ్లను గౌరవించుకోవాలని సూచించారు.
ఘంటసాల తర్వాత బాలునే: దత్తాత్రేయ
హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఘంటసాల త ర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి బాలు అని అన్నారు. ‘శంకరాభరణం’ నుంచి ‘పాడుతా తీయగా’ వరకు ఆయన ప్రస్థానం అద్భుతమని, వందలాది మంది కొత్త గాయకులను పరిచయం చేసిన ఘనత ఆయనదేనని గుర్తుచేసుకున్నారు.
అన్నయ్య కోరిక అదే: ఎస్పీ శైలజ
విగ్రహ ఏర్పాటుపై వచ్చిన విమర్శలపై బాలు సోదరి ఎస్పీ శైలజ స్పందించారు. ‘అన్నయ్య బతికి ఉన్నప్పుడే.. ఒకవేళ నా విగ్రహం పెడితే అది ఇక్కడ ఘంటసాల విగ్రహం పక్కన ఉండాలని కోరుకున్నారు. ఆయన కోరిక ఈ రోజు నెరవేరినందుకు కుటుంబ సభ్యులుగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విగ్రహ ఏర్పాటులో మా ప్రమేయం లేదు, అంతా కమిటీ వారే చూ సుకున్నారు. నిరసనల గురించి నాకు తెలియదు.
బాలు అందరివాడు, ఆయనకు ప్రాంతీయ బేధాలు లేవు’ అని స్పష్టం చేశా రు. బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాలకు అతీతంగా తన తండ్రి జీవించారని అన్నారు. ఆయనకు అందరూ ఒకటే అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ప్రజలు, బాలు విగ్రహం ఏర్పాటుకు నాలుగేళ్లుగా కృషి చేసిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి అందరితో ఎంత స్నేహపూర్వకంగా ఉండేవారన్న దానికి ఈ కార్యక్రమం ఓ నిదర్శనమన్నారు.
భారీ బందోబస్తు.. ఉద్రిక్తత
రవీంద్రభారతిలో ఆంధ్రాకు చెందిన బాలు విగ్రహం పెట్టొద్దంటూ గత కొద్దిరోజులుగా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాసం ఘాల నేతలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు రవీంద్ర భారతిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పటిష్ట భద్రత, భారీ బందోబస్తు మధ్య కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఎస్బీబీకి ఇష్టమైన 20 పాటలతో 50 మంది కళాకారులతో సంగీత విభావరి నిర్వహించారు. కార్యక్రమంలో శుభలేఖ సుధాకర్, డా. కేఐ వరప్రసాద రెడ్డి, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సినీ చరిత్రపై చెరగని సంతకం: మంత్రి శ్రీధర్‌బాబు
అభిమానుల కోరిక మేరకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నా రు. భారతీయ సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని అన్నారు. భారతీయ 14 భాషల్లో... 40వేలకు పైగా పాటలు పాడి, పాటకు ఎల్లలులేవని నిరూపించిన స్వర మాంత్రికుడు అని కొనియా డారు. తరాలు మారినా, ఆయన పాట నిత్యనూతనంగా ప్రతీ తెలుగు హృదయాన్ని తట్టి లేపుతూనే ఉంటుంద న్నారు.
సంగీత ప్రపంచంలో రారాజుగా... పాటల పల్లకిలో నెలరాజుగా... అమర గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ‘ఈ రోజు ఆవిష్కరించినది కేవలం విగ్ర హం మాత్రమే కాదని, అది సంగీతానికి, నిబద్ధతకు, వినయానికి ప్రతీక’ అన్నారు. కళలను ప్రోత్సహించేందుకు, కళాకారులను గౌరవించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.