కథ ఓకే.. దర్శకుడు ఎవరో తేలాలి
చిరంజీవి, వశిష్ట కాంబోలో వస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో చిరు ఉన్నారు. వాస్తవానికి సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ చిత్రం ‘గేమ్ చేంజర్’ కోసం విశ్వంభర సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. అంతేకాకుండా చిరు కూడా చికెన్ గున్యా కారణంగా కాస్త అనారోగ్యం పాలవడంతో ఆయన కొద్ది రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు.
ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నా కూడా పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే విశ్వంభర తర్వాత నెక్స్ ఏంటనే ప్రశ్న బాగా వినబడుతోంది. దీనికి నిన్న మొన్నటి వరకూ క్లారిటీ అయితే లేదు కానీ తాజాగా మాత్రం కొంత క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి విశ్వంభర తర్వాత కుమార్తె సుస్మిత దర్శకత్వంలో చిరు సినిమా చేయాల్సి ఉన్నా కూడా కథ, దర్శకుడు సెట్ అవకపోవడంతో పెండింగ్ పడుతోంది.
అయితే విశ్వంభర తర్వాత మచ్చ రవి దర్శకత్వంలో చిరు సినిమా చేసే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రవి కూడా తాజాగా తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం చిరుతో సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చారు. రవి రాసిన కథను చిరు ఓకే చేశారని తెలుస్తోంది. మొత్తానికి కథ కూడా ఓకే అయిపోయింది కాబట్టి ఈ చిత్రానికి రవి దర్శకత్వం వహిస్తారా? లేదంటే మరొకరెవరైనా డైరెక్ట్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.




