బుల్లెట్ నుంచి బ్యాలెట్ దాకా.. ప్రజల కోసమే పోరాటం
మంత్రి సీతక్క
మహబూబాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): బుల్లెట్ నుంచి బ్యాలెట్ దాకా వచ్చింది ప్రజల కోసమేనని, జీవితాంతం ప్రజల కోసమే పనిచేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క భావోద్వేగంగా పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాల్లపల్లి గ్రామంలో తన భర్త, ఉద్యమ సహచరుడు కుంజా రాము 22వ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంజా రాము స్మారక స్థూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. కుమారుడు సూర్యతో పాటు కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కుంజా రాము ఆదర్శాలు తన ప్రజాసేవకు ప్రేరణగా నిలిచాయని తెలిపారు. పేదలు, గిరిజనుల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనివని పేర్కొన్నారు. అనంతరం రచయిత ఆసనాల శ్రీనివాస్ రచించిన ‘అడవి దివిటీలు సీతక్క కుంజా రామన్న’ పుస్తకాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ పుస్తకం కుంజా రాము జీవితం, ఉద్యమ ప్రస్థానాన్ని ప్రజలకు చేరువ చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




