9 April, 2026 | 2:01 AM

చరిత్రాత్మకం రాంజీ గోండు జీవితం

09-04-2026 12:00 AM
  1. బ్రిటిష్, నిజాం పాలనను గడగడలాడించిన గోండు వీరుడి పోరాటం
  2. వెయ్యి ఊడల మర్రికి ఘనమైన చరిత్ర
  3. నేడు రాంజీ గోండు 166వ వర్ధంతి

ఆదిలాబాద్/ఉట్నూర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ కోటబురుజులతో... 13 గొలుసుకట్టు చెరువులతో... పచ్చని అడవులతో అలరాలే ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణం... ఇప్పుడు ఆ పట్టణం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొయ్యబొమ్మల నిలయం కూడా.... కేవలం కోట బురుజులు, కొయ్యబొమ్మలే కాదు భారత స్వతంత్రం సంగ్రామ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించ బడ్డ ప్రథమ స్వాతం త్య్ర సంగ్రామంలో పాల్గొని వేయి మంది వనవాసీ వీరులను అందించిన ఆ వనవాసీ వీరుల నాయకుడే ఆ రాంజీ గోండు. ప్రత్యక్ష సాక్షి వేయి ఊడల మర్రి. 

వందల ఏళ్ళ కిందటే ఇక్కడి బిడ్డలకు పోరా ట పాఠాలు నేర్పిన వీరుడు రాంజీ గోండు 1857లో ఉత్తర భారతంలో ప్రారంభమైన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఈ నేలలో నడిపించిన గోండు వీరుడే మన రాంజీ గోం డు. ఈ వీరుని నాయకత్వంలోనే ఏకకాలంలో అటు ఆంగ్లేయులు, ఇటు నైజాం పాలకులతో పోరాటం కొనసాగింది. చెల్లాచెదురుగా చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఈ పూర్వ ఆదిలా బాదు ప్రాంత వనవాసులందరినీ ఏకం చేసి, బ్రిటిష్ కలెక్టరు నివాసప్రాంతమైన నిర్మల్ ను తన యుధ్ధ భూమిగా ఎంచుకున్న ధీరుడు రాంజీ గోండు. ఈ వీరుని నేతృత్వంలో పని చేసిన వనవీరులను రోహిల్లాలు అంటారు. ఈ రోహిల్లాల పోరాటానికి మన చరిత్రకారులకు స్థానం కల్పించలేదు.

మధ్య భారతంలోని మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేక మంది గిరిజన తెగల సమూహాల్లో గోం డ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకుల రాక పూర్వ మే ఏర్పడి ఉన్నది. గోండుల పాలన క్రీ.శ 1240 వరకు సుమారు 5 శతాబ్దాల పాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్కంఠ్షా (క్రీ.శ 1735- 49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాం తం మరాఠీల ఆధీనమైనా, వారు బ్రిటిష్ వారి కి తలొగ్గి గోండ్వానాను తెల్లదొరలకు అప్పగించారు. గోండుల పాలన అంతమై, ఆంగ్లేయు ల, నైజాం పాలన ఆరంభమైంది. వీరి పీడనకు వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు మొదలైంది.

ఆదిలాబాద్ జిల్లాలోని రాంజీగోండు 1860 ప్రాంతంలో నాటి జనగాం (ఆసిఫాబా ద్) కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు. బ్రిటిష్ సైన్యంతో ఎదురొడ్డిన ఝా న్సీ లక్ష్మిబాయి వీరమరణం పొందిన తర్వాత నానా సాహెబ్, తాంతియాతోపే, రావు సాహె బ్లు తమ బలగాలతో విడిపోయారు. తాంతి యా అనుచరులైన రోహిల్లా సిపాయిలు పెద్ద సంఖ్యలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీద ర్, పర్బనీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. వీరు అజంతా, బస్మ త్, లాథూర్, మఖ్తల్, నిర్మల్ లను పోరాట కేంద్రాలుగా ఎంచుకున్నారు. వీరి నేతగా ప్రకటించుకున్న రంగారావు నిజాం ప్రభుత్వాన్ని పడగొట్టి, బ్రిటిష్ వాళ్లను తరిమేయాలని పోరాటానికి పూనుకున్నాడు. సైనిక బలగాల శిక్షణలో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసే క్రమంలో బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డాడు. యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ అండమాన్ జైలులో 1860లో మరణించాడు. దీంతో రాంజీ గోండు నేతృత్వంలో పోరాటం తీవ్రమైంది.

రోహిల్లాల పోరాటం ప్రధానంగా ఆసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనుల ప్రాంతం. రాంజీ గోండ్ సారథ్యంలో తిరుగుబాటు ఉధృతంగా మారింది. ఈ తిరుగుబాటు తుది కీలక ఘట్టం 1860 మార్చి, ఏప్రిల్‌లో జరిగింది. ఆదిలాబాద్ ఏజె న్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ గోండు నాయక త్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలసి నిర్మల్ సమీపంలోని కొండలను కేం ద్రంగా చేసుకుని బ్రిటిష్ పాలకులను ముప్పుతిప్పలు పట్టారు.

నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేశాయి. ఆధునిక ఆయుధాల ముందు, బ్రిటిషు వారి కుటిల యుక్తుల ముందు ఆదివాసులు నిలవలేకపోయారు. కడదాకా పోరాడిన రాంజీగోం డుతో సహా వెయ్యి మందిని పట్టుకుని నిర్మల్ ఎల్లపెల్లి మార్గంలో ఉన్న మర్రి చెట్టుకు 1860 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రి చెట్టే వెయ్యి ఉరుల మర్రిచెట్టుగా ప్రసిద్ధి చెందింది. ఇలాం టి ఘటనలు దేశ చరిత్రలో జరిగిన దాఖలాలు లేవు. ఒకేసారి ఒకే చెట్టుకు వెయ్యి మందిని ఉరితీసిన ఘటన చరిత్ర పుటల్లో లేకపోవడం గమనార్హం. కానీ మాతృభూమి కోసం చిరునవ్వులతో ఉరికొయ్యల ముధ్ధాడిన ఆవీరుల స్పూర్తి తర్వాతి తరం స్వతంత్ర యోధులకు ప్రేరణగా నిలచింది.

తెల్లదొరల దురాగతాలకు చిహ్నంగా నిలిచిన ఆ మర్రిచెట్టు తర్వాతి కాలంలో అంటే 1995లో వచ్చిన పెద్ద వడగళ్ల వానకు నేలకు ఒరిగింది. ఆతర్వాత అప్పటి బీజేపీ నాయకు లు  సీ.హెచ్. విద్యాసాగర్‌రావు  నేతృత్వంలో అదే ప్రదేశంలో మర్రి మొక్క నాటితే కొందరు ముస్లిం దురాక్రమణదారులు ఈ స్థలం మాది అంటూ మర్రి మొక్కను తొలగించారు. ఆ స్థలానికి దగ్గరలోనే రోడ్డుపై తర్వాత కాలంలో ఒక స్థూపం పెట్టారు. అదే విధంగా నిర్మల్ పట్టణంలో గొలుసుల దార్వాజ ప్రాంతం లో ఆమహనీయుని విగ్రహం పెట్టారు.

కానీ ఆ విగ్రహం ప్రాంతం మందుబాబుల నిలయం గా... చెత్త చెదారంతొ ఆమహనీయుని అవమానించెలా ఉంది.. రాంజీ గోండ్ నాయక త్వంలో సాగిన వీరోచిత పోరాటాన్ని చరిత్రకారులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ పోరాట మూలాలను వెతుక్కుంటూ తనదైన చరిత్రను పునర్నిర్మించుకుంటున్న తరుణంలో రాంజీ చరిత్రను వెలుగులోకి తేవాలి. రాంజీ పోరాటాన్ని, త్యాగాల్ని భావితరాలకు అందించాలి.