20 March, 2026 | 2:25 AM

‘ఉస్తాద్’ విజయం మాకు డబుల్ బొనాంజా

20-03-2026 01:00 AM

పవన్‌కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ఉగాది కానుకగా గురువారం (మార్చి 19) విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద తొలి ఆట సందర్భంగా ప్రేక్షకుల సందడి కనిపించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. “అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాని మలిచాం. సినిమాలో ఇంత కంటెంట్ ఉందని మాకు ముందు తెలియదంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలో ఇంతవరకు చూపించని అక్రమ వలసదారులు అంశం గురించి సినిమాలో చర్చించాం” అన్నారు. నిర్మాత నవీన్ మాట్లాడుతూ.. “మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది.

‘ఉస్తాద్’కు ఈ స్థాయి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనేది మా కల. అలాంటిది ఆయనతో సినిమా చేయడమే కాకుండా, ఇంత పెద్ద హిట్ అవ్వడం మాకు డబుల్ బొనాంజా. పెద్ద హీరో నుంచి కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమా వచ్చి చాలా కాలమైంది. మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమిది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, గీత రచయిత చంద్రబోస్ కూడా మాట్లాడారు.