calender_icon.png 14 January, 2026 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిండికేట్ ‘కృష్ణ’లీలలు!

14-01-2026 12:43:31 AM

  1. మద్యం మాఫియా... బెల్ట్ దందా !

బెల్ట్ షాపులు లేవట! ఎక్సైజ్ అధికారుల వెల్లడి

వైన్స్ నిర్వాహకుల ఒత్తిళ్లకు బెల్ట్ దుకాణదారుల బేజారు!

బెల్ట్ షాపుల సంక్షేమ సంఘం ఏర్పాటుకు కసరత్తు !

కాటారం, జనవరి 1౩ (విజయక్రాంతి) :జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలో సిండికేట్ ‘ కృష్ణ ‘ లీలలతో మద్యం మాఫియా ! బెల్టు దందా !! మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. దశాబ్ద కాలం నుంచి ‘ కృష్ణ- గీత ‘ కట్టుబాటుగా మారుతుంది.కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహా ముత్తారం, మల్హర్, మహాదేవపూర్, పలిమెల మండలాలలో గల వైన్స్ దుకాణాలను అన్నింటిని సిండికేట్ గా మార్చడంలో ‘ కృష్ణ సారథ్యం ‘సక్సెస్ మంత్రగా ఉపయోగపడుతుంది.

పలు రంగులు గల రాజకీయ పార్టీల నేతలను మచ్చిక చేసుకోవడంలో ‘ కృష్ణ కలరే ‘ ప్రముఖంగా వినిపిస్తోంది. ఆబ్కారీ అధికారులను, కొంతమంది పాత్రికేయులను, పోలీసులను గుప్పెట్లో పెట్టుకొని ఏకచత్రాధిపత్యంగా మంథని నియోజకవర్గంలోని కాటారం సబ్ డివిజన్లో తను చెప్పిందే వేదంగా ‘ కృష్ణ గీతోపదేశం ‘ పరిడవిల్లుతోంది. కాటారం మండలంలో మండల కేంద్రంలోని గారేపల్లిలో రెండు వైన్స్ దుకాణాలను ఒకే గొడుగు కింద నిర్వహిస్తుండగా, మరొకటి రేగుల గూడెం గ్రామపంచాయతీ పరిధిలో గంగారం క్రాస్ రోడ్ వద్ద నడిపిస్తున్నారు.

రెండు ఒకే సముదాయంలో వైన్స్ దుకాణాలు నిర్వహించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని తుంగలో తొక్కి నిర్వాహకులు ఆబ్కారీ అధికారులను మభ్యపెట్టి, మద్యం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నారని పలువురు చెబుతున్నారు. గారేపల్లి కేంద్రంగా నడుస్తున్న రెండు వైన్స్ దుకాణాలకు కూతవేటు దూరంలోనే ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయం ఉన్నప్పటికీ, నిర్వాహకుల కనుసన్నల్లోనే సంబంధిత అధికారులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని చెబుతుండడం,, అధికారుల నిజాయితీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

వైన్స్ దుకాణాలలో బ్రాండెడ్ మద్యం లభించ డం లేదని మద్యం ప్రియులు ఎన్నోసార్లు బ్రాంధీ షాప్ వద్ద గొడవలు పెట్టుకున్నారు. అలాగే ఆబ్కారీ అధికారులకు, పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ.. కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా ఆ శాఖ అధికారులు వ్యవహరించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.మద్యం దుకాణాలను చేజిక్కించుకున్న నిర్వాహకులు సిండికేట్ గా ఏర్పడి హోల్ సేల్ దందాకు తెరలేపి, రెండు షాపులను ఒకే గూటిలోకి మార్చి తమ పంథాను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

ఒకటి హోల్ సేల్ గా, మరొకటి రిటైల్ దుకాణంగా పక్కపక్కనే నడుస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మద్యం ప్రియులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు రోజుకు కోటి పాతిక లక్షలు రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కానీ పన్నును ఎగనామం పెడుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత ఐటి ఆదాయపు పన్ను అధికారులు.. వైన్స్ దుకాణాలను చేజిక్కించుకున్న నిర్వాహకుల లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు సూచిస్తున్నారు. కోట్లకు పడగలెత్తుతున్న వారి ఆస్తులు, ఆదాయాలపై అధికారులు కన్నేయకపోవడంతో మద్యం మరో మాఫీయాగా మారి, వారి ఇష్టా (కృష్ణా) రాజ్యంగా తయారైనట్లు ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.