calender_icon.png 16 December, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్ వార్డుల పెంపుపై గులాబీ గరం

16-12-2025 01:56:17 AM

  1. కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చిన బీఆర్‌ఎస్ నేతలు
  2. కోర్టుకు వెళ్తాం: మాజీ మంత్రి తలసాని

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ వార్డుల పెంపు, పునర్విభజన వ్యవహారంపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ, డివిజన్ల సంఖ్యను ఏకపక్షంగా 300కు పెంచడంపై గులాబీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జరగనున్న జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో.. సోమవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే మల్లారెడ్డి తదితరులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎవరినీ సంప్రదించకుండానే 300 డివిజన్లు పెంచేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఇంత తొందర ఎందుకు? మంగళవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో మా వాదన బలంగా వినిపిస్తాం. ప్రజాభిప్రాయం లేకుం డా ముందుకెళ్తే ఊరుకోం అని తలసాని హెచ్చరించారు. ఫ్లెక్సీల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు.మేము కోర్టును ఆశ్రయిస్తాం. న్యాయపోరాటం చేస్తాం అని హెచ్చరించారు. ఈ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీ ల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ ప్రాంతం గతంలో గ్రామీణ వాతావరణంలో ఉండేదని, ఇప్పుడిప్పుడే అభివృ ద్ధి చెందుతోందని తెలిపారు. ఇలాంటి సమయంలో అశాస్త్రీయంగా విలీనం చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని పరోక్షంగా వ్యాఖ్యానించారు.