తెలంగాణ OG కేసీఆరే
- తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరే
- పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయ వాదమేనా?
- తెలంగాణకు కాంగ్రెస్సే మొదటి శత్రువు
- కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని కచ్చితంగా ఓడిస్తాం
- కేసీఆర్ బీఆర్‌ఎస్ ట్రంప్ కార్డ్... అవసరమైనప్పుడు బయటకు వస్తారు
- ఇప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్‌ఎస్‌కు 90 సీట్లు వస్తాయి
- నేను చెప్పినవన్నీ తప్పు అని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలొదిలేస్తా
- ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తాం
- ‘మీట్ ది ప్రెస్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి) : తెలంగాణకు అసలైన ‘ఓజీ’ కేసీఆరే అని, ఆయనే తెలంగాణను కాపాడుకుంటారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోవాలన్నారు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడాలని పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేశారని, అది కూడా ప్రాంతీయవాదం అంటారా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఆషామాషీగా, అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదని, వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ.. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి దశాబ్దాల తరబడి కాంగ్రెస్సే మొదటి శత్రువు అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తామని, గతంలో కొడంగల్లో ఓడించిన తీరుగానే వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రజలకి, పార్టీకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారని.. బీఆర్‌ఎస్ ట్రంప్ కార్డ్, తురుపుముక్క కేసీఆర్ అని, ఆయన ఎప్పుడు వస్తే బాగుంటుందో పార్టీకి తెలుసు అన్నారు. కేసీఆర్ ఖచ్చితంగా ప్రజల కోసం వస్తారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి బొందపెడతారు.. రైతన్నలను అడ్డగోలుగా కాల్చుకు తింటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రైతన్నలు చేసే ఉద్యమానికి, ఎదురుదెబ్బకు.. కాంగ్రెస్ పార్టీ మరో 15 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతుందన్నారు. తెలంగాణ ప్రజలకి ఎప్పుడు ఏ విధంగా ఉద్యమం చేయాలో, బుద్ధి చెప్పాలో తెలుసు అని కేటీఆర్ అన్నారు.
ఫ్యూచర్ సిటీ అనేదే అసలు లేనేలేదనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే స్వయంగా కోర్టులో చెప్పిందని, ఒకవేళ ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలు ఫార్మా సిటీ కోసం, పరిశ్రమల కోసం ఇచ్చిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలను ఎండగడతామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముమ్మాటికీ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ కేవలం కాంగ్రెస్ పార్టీ తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నదని ఆరోపించారు.
ఒకవైపు హైకోర్టు లో ఫ్యూచర్ సిటీ లేదు, కేవలం ఫార్మా సిటీ మాత్రమే ఉన్నదని చెప్పిన కాంగ్రెస్, అక్కడ జూ పార్కులకు, ఇతర సంస్థలకు ప్లాట్ల చొ ప్పున అమ్మాలని చూస్తున్నదన్నారు. ఈ సం దర్భంగా ఫ్యూచర్ సిటీని ఖచ్చితంగా రద్దు చేస్తామని కేటీఆర్ అన్నారు. దశాబ్ద కాలం లో సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించామని తెలిపారు. రాష్ట్రాన్ని పాలించే పటిమ మీకుందా అని ఆనాడు కొందరు అన్నారని, కానీ మాకు కూడా కేసీఆర్ లాం టి పాలకుడు కావాలనుకునేలా పదేళ్ల పాల న సాగిందన్నారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక రా ష్ట్రం తెలంగాణ అన్నారు. పెట్టుబడి సాయం కింద రైతు బంధు, తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపామన్నారు. నే ను చెప్పినవన్నీ తప్పు అని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని సవాల్ చేశారు. తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ఉద్యమకారులు పైకి తుపాకీ పట్టిన వ్యక్తి సీఎం పదవీలో కూర్చోవడం బాధగా ఉందన్నారు.
ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం.. పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం..
100 శాతం ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ల, ఈ నేల కోసం పోరాటాలు, త్యాగాలు చేసినవాళ్ల నెత్తురుతో తడిచిన నేల ఇది అన్నారు. ముమ్మాటికీ తెలంగాణ ఈ భూమి పుత్రులు, ఇక్కడున్న నాలుగు కోట్ల మంది జాగీరే, ఇందులో ఎవరికీ అనుమానం కూడా అక్కర్లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాన్ రావచ్చు, ఇక్కడే ఉండొచ్చు, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి.. ఎవరొద్దన్నారు?, 10, 12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందా? అని ప్రశ్నించారు.
ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారని, ప్రధాని మోడీ ప్రస్తుతం ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను పట్టుకొని పోతున్నారని, మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అని నిలదీశారు. ప్రధానమంత్రి గుజరాత్‌కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు.
జనగణమన మాకు నేర్పించాల్సింది ఏమీ లేదని, దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కచ్చితంగా గౌరవిస్తామని, ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం... ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతామని, కానీ వచ్చి మా సెక్రటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోబోమని హెచ్చరించారు. ఈ దేశంలో ఏ నాయకుడైనా, ఏ నాయకురాలైనా పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు, ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఇందులో ఏమీ అనుమానం పడక్కర్లేదని స్పష్టం చేశారు.
కానీ ఏ ప్రాంతంలోనైతే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో, ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి మనోభావాలు, పోరాటాలు, త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి, వారి మీద అభిమానం ఉండాలన్నారు. అయినా తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేదేముంది?, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 350 వార్డుల్లో కూడా పోటీ చేశారు కదా అని ప్రశ్నించారు. 2018లో చంద్రబాబు నాయుడు పోటీ చేశారని, 23లో మీరు పోటీ చేశారు.. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 11 రోజులు అన్నం ముట్టకుండా ఉండి, మళ్లీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ అడ్డుకున్న విషయంలో ఏమైనా కాంగ్రెస్ అనాలన్నారు.
కాంగ్రెస్సే మొదటి శత్రువు
అది తొలిదశ తెలంగాణ ఉద్యమమైన, తర్వాత జరిగిన మలిదశ ఉద్యమమైనా.. ప్రతిసారి అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కేసీఆర్ సారథ్యంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా అడుగడుగునా కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కేటీఆర్ గుర్తు చేశారు. చివరికి కాంగ్రెస్ ద్రోహాలను వ్యతిరేకంగా కేసీఆర్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం నుంచి మొదలుకొని అనేకసార్లు ఉప ఎన్నికలకు వెళ్లి మరి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మనోభావాలను తెలియజేశారని అన్నారు.
తెలంగాణ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి మోసం చేసింది కాంగ్రెస్సే అన్నారు. చివరికి కేసీఆర్ దీక్ష తర్వాత కూడా ప్రకటించిన రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని, వందల మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలికొన్నది కాంగ్రెస్సే అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా, తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తిని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ అన్నారు.
తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత బీఆర్‌ఎస్‌ది, ఆనాటి సీఎం, ఉద్యమనేత కేసీఆర్‌దే అన్నారు. ఒకనాడు అన్నమో రామచంద్రా అన్న పరిస్థితి నుంచి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీసుకువెళ్లింది కేసీఆర్ అన్నారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు కట్టి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించిన కేసీఆర్.. అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అద్భుతంగా సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఒకప్పుడు నెర్రెలు పారి నెత్తురు పారిన నేలల్లో వ్యవసాయ సాగుబడిని లాభసాటిగా మార్చి దేశంలోనే అత్యధిక పంటలు పండించే రాష్ట్రంగా తయారు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. నల్లగొండ లాంటి జిల్లాల్లో ఫ్లోరోసిస్ అనే దరిద్రాన్ని తరిమింది కేసీఆర్ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టి వైద్య విప్లవం తీసుకువచ్చింది ఆయనే కేసీఆర్ గారే అని, చివరికి ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు గురుకులాల ద్వారా అద్భుత విద్య అందించి విద్యా విప్లవం తెచ్చింది కూడా కేసీఆరే అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలకు 24 గంటల విద్యుత్ అందియడంతో పాటు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కరెంట్ కోతల నుంచి తప్పించి అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చింది కూడా కేసీఆర్ పాలనే అని గుర్తు చేశారు. అట్టడుగున ఉన్న తలసరి ఆదాయాన్ని అగ్రస్థానంలోకి తీసుకువెళ్లి ఆర్థిక విప్లవాన్ని సృష్టించింది కూడా కేసీఆర్ బిఆర్‌ఎస్ పరిపాలన అన్నారు. అద్భుతమైన ప్రగతి సాధించిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి, అన్ని వర్గాలను మోసం చేసి, మాయమాటలతో అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి తెలంగాణ తిరోగమనంలోకి జారుకున్నదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సినిమా ఫెయిల్యూర్, అట్టర్ ప్లాప్ అని అర్థమైందని, ఒక డిజాస్టర్ సెకండ్ హాఫ్ మిగిలి ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నూరు రోజులు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అంటూ అడ్డగోలు ప్రచారాలు చేసి ఇప్పుడు అన్ని వర్గాలను అడుగడుగునా మోసం చేస్తున్నది.
మోదీ, రేవంత్ జోడీ ప్రభుత్వం..
ధాన్యం కొనుగోళ్ల పైన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు అలవాటుపడిన కాంగ్రెస్ పార్టీ, రైతన్నల దగ్గర ధాన్యం కొనే తెలివి లేకుండా పోయిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల పైన ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు అన్నీ అవాస్తవమన్నారు. కేవలం ప్రజలను, రైతన్నలను మభ్యపెట్టేందుకే అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ విమర్శించారు. చివరి గింజ దేవుడెరుగు కనీసం తొలి గింజ కూడా కొనే పరిస్థితి లేదన్నారు. 60 రోజులు దాటినా కొనుగోలు కేంద్రాల్లో రైతన్నలు దిక్కులు చూస్తూ వర్షానికి ధాన్యాన్ని నష్టపోతున్న పరిస్థితి ఉన్నదన్నారు. మోదీ, రేవంత్‌తో జోడీ కట్టి ఇక్కడ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు.
తెలంగాణ రైతన్నలకు ఉచిత కరెంటును దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ’రైతు డిస్కమ్’ పేరిట కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. ఒక్క రైతు కూడా అడగకుండానే ఎందుకు రైతు డిస్కమ్ పెడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు డిస్కమ్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఎందుకు ప్రారంభిస్తున్నారన్నారు. కేసీఆర్ ఎలాంటి రైతు డిస్కమ్ లేకుండానే రైతన్నలకు 24 గంటల కరెంట్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఏ రైతు అడిగారని రైతు డిస్కమ్ పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ మోటార్లకు మీటర్లు పెట్టే విధానంపై జాగ్రత్తగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు.
జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి మోసం
రెండు వందల కోట్లు... రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు కూడా అందరిలాగే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఫ్యూచరే లేని రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ అనే ఒక ఊహాజనిత నగరంలో ప్లాట్లు ఇస్తామని జర్నలిస్టులను మోసం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి నిజంగానే జర్నలిస్టుల ఇండ్ల పట్టాలు ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికే జర్నలిస్టులకి ఇచ్చిన స్థలంలోనే స్థలాలు కేటాయించాలని, అవసరమైతే మంచిరేవుల లాంటి చోట కూడా, బుద్వేల్ వంటి చోట 100 ఎకరాల (జాగా) కేటాయించాలని సూచించారు.
కానీ కేవలం జూ పార్కుల పక్కన, ఫార్మా ప్లాంట్ల పక్కన జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తామని వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి జర్నలిస్టు సమాజానికి 100 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారత రాష్ట్ర సమితిదేనని, అందరికన్నా ఎక్కువగా అక్రిడేష న్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా బీఆర్‌ఎస్‌దేనని కేటీఆర్ గుర్తు చేశారు. జర్నలిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న మాయమాటలకు లొంగిపోరాదని కేటీఆర్ అన్నారు.
ఓటర్ల ‘వడపోత’పై అప్రమత్తం
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రతిబూత్ పరిధిలోనూ దొంగ ఓట్లను ఏరిపారేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం సీతాఫల్‌మండిలో జరిగిన సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యే టీ. పద్మారావుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ సలీం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో 95 లక్షలు, బిహార్‌లో 65 లక్షల ఓట్లు అక్రమంగా తొలగించడం వల్లే విపక్షాలు నష్టపోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అలాంటివి జరగకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు అధికారులు వస్తారని, ప్రతీఒక్కరికి ఓటు కల్పించాలన్నారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఓట్ల అక్రమాలను కేటీఆర్ ప్రస్తావించారు.
కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి
సికింద్రాబాద్(విజయక్రాంతి): రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ వెళ్లాలి.. కేసీఆర్ రావాలి అన్నదిగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం సీతాఫలమండి మల్టీప్లెక్స్ ఫంక్షన్ హాల్‌లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో సర్ సభ్యత,అవగాహన సదస్సు నిర్వహించగా కేటీఅర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో భాగంగా 2025లో ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.
జూన్ 25 నుంచి జూలై 25 వరకు అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. ‘దొంగ ఓట్లు’ అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. దొంగ ఓట్లు తొలగించాల్సిన అవసరం ఉందని, పారదర్శక ఓటరు జాబితా అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్,మన్నే క్రిశాంక్ ,యువనేత తీగుళ్ల రామేశ్వర్ గౌడ్, తీగల త్రినేత్ర గౌడ్, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు
తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదు.. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదని, ఒక్క రూపాయి అదనంగా కేటాయించకుండా తెలంగాణకు ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం పైన సెక్షన్ 8 ని అడ్డం పెట్టుకొని హైదరాబాద్‌ను కేంద్ర పాలితంగా చేయాలన్న కుట్ర కూడా గతంలో కొంత జరిగినది. అయితే మరోసారి అలాంటి ప్రయోగాలు గనుక చేస్తారని నేను అనుకోవడం లేదన్న కేటీఆర్.. ఒకవేళ అలాంటి ప్రయోగం చేస్తే తెలంగాణలో మరొక బలమైన ఉద్యమం వస్తుందన్నారు.
అలాంటి ప్రజా ఉద్యమానికి బీఆర్‌ఎస్ నాయకత్వం వహిస్తుంద న్నారు. ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని.. కేవలం రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసిన ఆనాటి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకే ఆ నైతికత ఉన్నదన్నారు. ఉచిత విద్యుత్ రైతన్నలకు ఇవ్వకూడదు అన్నదే రేవంత్ రెడ్డి సిద్ధాంతమన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను చెప్పిన మాటలకి కట్టుబడి ఉచిత విద్యుత్తును దూరం చేసాలా రైతు డిస్కమ్ పేరుతో కుట్రలు చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ ఎత్తివేస్తారన్నారు.
బీఆర్‌ఎస్‌కు 90 సీట్లు ఖాయం..
2034 దాకా ఉంటానన్న రేవంత్ రెడ్డి మాటలకు కూడా కేటీఆర్ స్పందించారు. ఈరోజు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 90 సీట్లకు పైగా గెలుస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన రేవంత్ రెడ్డి ప్రతిరోజు అటెన్షన్ డైవర్షన్ కోసం నాటకాలు ఆడుతున్నారు తప్ప ఆయనకు ఏ అంశంలోనూ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు అన్నారు. లగచర్లలో రేవంత్ రెడ్డి చేసిన అరాచకాలు, ఆయన అన్నదమ్ములు చేస్తున్న అరాచకాల వలన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఓడిపోతారన్నారు.
రేవంత్ రెడ్డికి నిజంగానే తన నాయకత్వం పైన, తిరిగి వస్తానని నమ్మకం ఉంటే వెంటనే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వము అని చెప్పి కోమటిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పైన కేటీఆర్ స్పందించారు. కోమటిరెడ్డికి నిజంగానే దమ్ముంటే ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వమని చట్టం చేయాలన్నారు. దానికంటే ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్లో చెప్పినట్లు 72 శాతం కాంట్రాక్టులు ఆయా వర్గాలకు దక్కేలా చట్టం చేయాలని కేటీఆర్ కోరారు.
తుమ్మిడిహట్టిపై రేవంత్‌రెడ్డి డ్రామా
రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పడం అత్యంత దారుణమన్నారు. నిజంగానే ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, నిరసన కార్యక్రమం చేపట్టాలని కేటీఆర్ కోరారు. కానీ అదేదీ లేకుండా కేవలం మాటలు చెప్పడం కోసమే తమ్మిడిహట్టి పైన ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ సీఎంగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ చాలా స్పష్టంగా తమ్మిడిహట్టి ప్రాజెక్టు పైన ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు పూర్తిగా వృథా అని, ఎట్టి పరిస్థితులలోనూ 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టుకు ఒప్పుకోమని స్పష్టం చేశారని.. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రయత్నం చేసామని కేటీఆర్ అన్నారు. ఇవన్నీ రేవంత్‌రెడ్డికి తెలిసినా తమ్మిడిహట్టి పేరుతో డ్రామా ఆడుతున్నారన్నారు.






