13 August, 2026 | 4:02 AM

యూరియా యాప్‌ను రద్దు చేయాలి

13-08-2026 12:49 AM

చేగుంట  రహదారిపై పోలంపల్లి రైతుల రాస్తారోకో

చేగుంట, ఆగస్ట్ 12 (విజయక్రాంతి): యూరియా ఎరువుల పంపిణీ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోలంపల్లి గ్రామానికి చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యూరియా లభించక పంటలు దెబ్బతింటున్నాయని, నిత్యం తిప్పలు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేగుంట - మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా కొనుగోలు కోసం తీసుకొచ్చిన కొత్త యాప్ వల్ల సామాన్య రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ఫోన్లు, సాంకేతిక పరిజ్ఞానం లేక, నెట్వర్క్ సమస్యల కారణంగా యాప్లో నమోదు చేసుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. సమయానికి యూరియా దొరక్క వేసిన పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. వెంటనే ఈ యాప్ విధానాన్ని స్వస్తి చెప్పి, పాత పద్ధతిలోనే సహకార సంఘాలు (సొసైటీలు), రిటైల్ డీలర్ల ద్వారా ఉచితంగా, సరిపడా యూరియాను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.

స్తంభించిన పోలంపల్లి - చేగుంట రహదారి

రైతులు రోడ్డుపై బైఠాయించడంతో చేగుంట - మెదక్ మార్గంలో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ ఐ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన యూరియా అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తాత్కాలి కంగా ఆందోళన విరమించారు.