దివాకర్‌రావు పాలనలో అభివృద్ధి జరగలేదు..
బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్
మంచిర్యాల టౌన్, ఆగస్టు 12 : దివాకర్ రావు పాలనలో మంచిర్యాల నియోజక వర్గంలో అభివృద్ధి జరగలేదనీ బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివాకర్ రావు 20 ఏండ్ల పాలన వైఫల్యం చెందటం వల్లనే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నేను కట్టించాను అని గొప్పలు చెప్పుకుంటున్న దివాకర్ రావు ప్రాజెక్ట్ సాధన కోసం వారు చేసిన పోరాటం ఏంటని ప్రశ్నించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం కనీసం ఒక్క ధర్నా లేదా ఒక్క వినతి పత్రం అయినా సమర్పించారా అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుంటే దివాకర్ రావు కు ఎల్లంపల్లి దివాకర్ రావు అని పేరు వచ్చింది తప్పితే ముంపు బాధితులకు చేసింది శూన్యం అని అన్నారు.
ఎల్లంపల్లి బాధితుల పట్ల అంత చిత్త శుద్ధి ఉంటే ముందు బాధితులకు పెండింగ్ లో పరిహారం మీ హయాంలో ఎందుకు చెల్లించిందని నిలదీశారు. గూడెం లిఫ్ట్ పైపులు తరుచు పలిగిపోతుంటే వాటిని మార్చాలని ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేసి పైపులు మార్చాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది మా రఘునాథ్ అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాల తరువాత ఇప్పుడు విజిత్ రావు బయటకు వచ్చి మేము రైతుల కోసం పోరాడుతున్నం అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని, అసలు ఈ రోజు రైతుల పరిస్థితి ఇలా ఉండటానికి కారణం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వైఫల్యమే అని అన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ పార్టీ అని, మంచిర్యాల గెలిచేది రఘునాథ్ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, జయరామ రావు, కమలాకర్ రావు, కుర్రే చక్రవర్తి, రంగ శ్రీశైలం, ఆడే ప్రేమ్ సింగ్, కల్వచర్ల అనీల్, దేవరకొండ వెంకన్న, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.






