06-01-2026 12:00:00 AM
వెనిజులాపై అమెరికా జరిపిన మెరుపు దాడులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వెనిజులా రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుజామున ‘అబ్జల్యూట్ రిజాల్వ్’ పేరుతో ఏడు చోట్ల భారీ పేలుళ్లు జరిపింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వలసలను అరికట్టేందుకే వెనిజులాపై దాడులు జరిపినట్లు అమెరికా పేర్కొంది. సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా దాడులకు పాల్పడిన అమెరికా అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అదుపులోకి తీసుకొని బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించింది.
అయితే కేవలం మాదకద్రవ్యాల అక్రమ తరలింపును అరికట్టడం కోసమే ఇంత భారీ స్థాయి ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా పేర్కొంటుంది. కొలంబియా నుంచి అమెరికాకు వెళ్లే కొకైన్ రవాణాలో వెనిజులా కీలకపాత్ర పోషిస్తుందని, మదురో ప్రభుత్వం దీని ద్వారా కోట్లాది డాలర్లు సంపాదిస్తోందని పేర్కొంది. వాస్తవానికి వెనిజులాలోని చమురు నిల్వలపై అమెరికా ఎప్పుడో కన్ను వేసింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెనిజులాకు పేరుంది.
మరోవైపు అమెరికాకు ఇంధన భద్రత అనేది చాలా ముఖ్యం. లాటిన్ దేశమైన వెనిజులాలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే తక్కువ ధరకే నిరంతరం ఆయిల్ సరఫరా జరుగుతుంది. వెనిజులాపై పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో అక్కడి 80 శాతం చమురును ప్రస్తుతం చైనా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నది. దీంతో వెనిజులా తమ చెప్పు చేతల్లో ఉంటే చమురు నిక్షేపాలు తమ అధీనంలోనే ఉంటాయని అమెరికా వ్యూహాలు పన్నింది. చమురు నిల్వలను శుద్ధి చేసే బాధ్యతలను అమెరికన్ కంపెనీలకు కల్పించాలని భావించింది.
అందుకే ముందు వెనిజులాలో అధికారంలో ఉన్న నికోలస్ మదురోపై నార్కో టెర్రరిజం ఆరోపణలు చేసింది. అంతర్జాతీయ చట్టాలను తుంగలోకి తొక్కి నికోలస్ మదురోను కుట్రపూరితంగా పదవీచ్యుతుణ్ని చేసిన అమెరికా తాను అనుకున్నది సాధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌పై కూడా ట్రంప్ బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. తాను చెప్పిన ప్రకారం నడుచుకోకపోతే మదురో కంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని డెల్సీ రోడ్రిగ్జ్‌ను ట్రంప్ హెచ్చరించారు.
వెనిజులాలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడితే అనేక లాభాలుంటాయని అమెరికా భా వించింది. పేరుకు మెరుపు దాడులను చెప్పినప్పటికీ వెనిజులాను తమ అధీనంలోకి తెచ్చుకుంటే అక్కడ ఉన్న చమురు బావుల పునర్నిర్మాణం, వెలికితీత కాంట్రాక్టులన్నీ అమెరికన్ కంపెనీలకే దక్కుతాయనేది అమెరికా ఆలోచన. అంతేకాదు లాటిన్ అమెరికాలో రష్యా, చైనా ప్రభావాన్ని తగ్గించడాన్ని కూడా అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది.
వెనిజులాపై దాడి ముగిసిందని, తర్వాతి వంతు మీదేనంటూ మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే అమెరికా ఇలా చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో గ్వాటెమాలా, నికరాగువా, చిలీ, బ్రెజిల్, బొలీవియా, ఈక్వడార్ వంటి లాటిన్ అమెరికా దేశాల్లో సైనిక నియంతలను ప్రోత్సహించి ప్రభుత్వాలను కూల్చడంలో విజయవంతమైంది. అంతిమంగా వెనిజులాలో ప్రస్తుత సంక్షోభం.. ప్రజాస్వామ్యం, డ్రగ్స్, మానవ హక్కుల పోరాటంలా కనిపిస్తున్నప్పటికీ మూలం మాత్రం చమురు నిక్షేపాల చుట్టూనే తిరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.