calender_icon.png 12 December, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటేత్తిన పల్లెలు..

12-12-2025 01:06:51 AM

  1. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు...

ఆదిలాబాద్ జిల్లాలో 75.25% పోలింగ్ నమోదు

మంచిర్యాల జిల్లాలో 80.04 % పోలింగ్ నమోదు

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 79.81 % పోలింగ్ 

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు..

గెలిచిన వారిలో ఆనందం... ఓడిన వారిలో నిరాశ...

ఆదిలాబాద్/మంచిర్యాల/కుమ్రంభీం ఆసి ఫాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి) :  ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచా యతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. అక్కడక్కడ చిన్నపాటి ఘటనలు మినహా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. తొలి విడతలో ఇచ్చోడ, సిరికొం డ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఎన్నికలు జరిగాయి.

తొలి విడతలో 166 సర్పంచ్ లకు, 1,390 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. చలిని సైతం లెక్కచేయకుండా పొద్దున్నే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివ చ్చారు. పలు కేంద్రల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. దీంతో పల్లెల్లో పండగ వాతావరణం కనిపించింది.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం అని ఏర్పాటు చేసింది. పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ను పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు. మొత్తం 75.25% పోలింగ్ నమోదు అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

పోలింగ్ శాతం పర్వాలేదు..

పంచాయతీ ఎన్నికలు కావడం.. స్థానికులు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొంటారని ముందుగానే ఆశించారు. పోలింగ్ శాతం కూడా భారీగా పెరుగుతుందని బరిలో ఉన్న ఆశావహులతో పాటు అధికారులు సైతం భావించారు. కానీ వారు ఆశించిన మేర పోలింగ్ శాతం కొంత తగ్గినా 75 శాతం పైగా నమోదు కావడం కొంత ఊరట నిచ్చింది. తొలి విడతలో వివిధ మండలాల పరిధిలోని జరిగిన ఎన్నికల్లో 1,52,626 మంది ఓటర్లకు గాను 1,14,847 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇందులో పురుషుల ఓట ర్లు 75,043 మందికి గాను 57,274 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లలో 77, 572 మందికి గాను 57,274 మంది ఓటు వేశారు. ఇతరులు 11 మందిలో ముగ్గురు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 75.25 పోలింగ్ శాతం నమోదైంది. 

గెలిచిన వారిలో ఆనందం...

పంచాయతీల్లో గెలుపే లక్ష్యంగా బరిలో నిలిచిన అభ్యర్థులు చివరి వరకు సర్వశక్తులు ఒడ్డారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఇందులో కొందరు సఫళీకృతులు కాగా.. మరికొదరికి నిరాశ ఎదురైంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎన్నికలైనప్పటికీ ఆయా పార్టీల మద్దతు తోనే అనేకమంది బరిలో నిలిచారు.

ఆయా పార్టీల మద్దతు లేని వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. కాగా ఫలితాలు వెలువడగానే విజయం వరించిన వారిలో సంతోషం వ్యక్తం చేయగా.. ఓడిన వారిలో నిరాశ వ్యక్తమైంది. పల్లెల్లో తొలి సమరం ముగియడంతో ఇక అధికారులు, నాయకులు రెండో విడతపైనే దృష్టి సారిస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన తొలిదశ పోలింగ్

మంచిర్యాల జిల్లా పరిధిలోని మంచిర్యాల నియోజక వర్గంలోని హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలం, ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలాల్లో 90 గ్రామ పంచాయతీలుండగా ఆరు జీపీలు ఏకగ్రీవం కాగా మూడు జీపీలకు నామినేషన్ లు వేయకపోవడంతో 81 గ్రామ పంచాయతీలకు గురు వారం మెదటి విడుత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

నాలుగు మండలాల్లో 1,19,700 (దండేపల్లిలో 34,213, హాజీపూర్ లో 16,954, జన్నారంలో 43,306, లక్షెట్టిపేటలో 25,227) మంది ఓటర్లుండగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో నెమ్మదిగా పోలింగ్ ప్రారంభమైంది. తొమ్మిది గంటల వరకు 20,576 (16.59 శాతం) ఓట్లు పోలవగా, 11 గంటల వరకు 60,606 (51 శాతం), మధ్యాహ్నం ఒంటి గంట వరకు 92,915 (77.62 శాతం) ఓట్లు పోలయ్యాయి. 81 గ్రామ పంచాయతీలకు 258 (దండేపల్లిలో 75, హాజీపూర్ లో 39, జన్నారంలో 98, లక్షెట్టిపేటలో 46) మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 816 (దండేపల్లిలో 278, హాజీపూర్ లో 106, జన్నారంలో 272,

లక్షెట్టిపేటలో 160) వార్డులుండగా 268 (దండేపల్లిలో 103, హాజీపూర్ లో 22, జన్నారంలో 111, లక్షెట్టిపేటలో 32) వార్డులు ఏకగ్రీవం కాగా 34 వార్డులకు నామినేషన్ లు దాఖలు కాకపోవడంతో 514 (దండేపల్లిలో 143, హాజీపూర్ లో 84, జన్నారంలో 159, లక్షెట్టిపేటలో 128) వార్డులకు ఎన్నికలు జరిగాయి. 1476 (దండేపల్లిలో 435, హాజీపూర్ లో 219, జన్నారంలో 498, లక్షెట్టిపేటలో 324) మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు భరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు పోటాపోటీగా వాహనాల ద్వారా తరలించారు. గ్రామాల్లోని వాడల నుంచి ఆటోలలో కేంద్రాలకు తీసుకెళ్లారు. వృత్తి రీత్యా పట్టణాలలో ఉంటున్న, సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను తీసుకువచ్చేందుకు వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కార్లను సమకూర్చి పోలింగ్ కేంద్రాలకు అభ్యర్థులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో ఏసీపీలు, సీఐలు, ఎస్త్స్రలు భారీ  బందోబస్తు నిర్వహించారు.

ఆసిఫాబాద్‌లో పల్లె పోరు ప్రశాంతం 

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా లో చేపట్టిన మొదటి విడత ఎన్నికలు గురువా రం ప్రశాంతంగా ముగిశాయి.ఎన్నికల అధికా రులు నిర్వహణను ప్రణాళిక బద్దంగా ముంద స్తు చర్యలు తీసుకుంటున్నాను ఇప్పటికప్పుడు ఎన్నికల సరళిని పరిశీలించారు. మొదటి విడత జిల్లాలోని ఐదు మండలాలలో జరిగిన ఎన్నికల్లో 114 గ్రామపంచాయతీలలో ఐదు ఏకగ్రీవం కాగా మిగతా చోట్ల సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు.

106 గ్రామపంచాయతీలు, 368 వార్డు సభ్యుల ఎన్నికలు జరిగాయి.జై నూర్ 76.81 శాతం, కెరా మేరి 83.38 శాతం,లింగాపూర్ 79.61 శాతం,సిర్పూర్ యు 81. 18 శాతం,వాంకిడి 78.93 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఐదు మండ లాల్లో 96,068 ఓటు హక్కు విని యోగించుకోవాల్సి ఉండగా 76, 668 ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడత 79.81 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. 48230 మంది పురుషులు ఓటు వేయాల్సి ఉండగా 38824 వేశారు. 49082 మహిళలు ఉండగా 37844 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ కేంద్రాల సందర్శన...

జిల్లాలో మొదటి విడత ఐదు మండలాల్లో జరిగిన సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే,ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాస్,ఎస్పీ నితిక పంత్,ఏ ఎస్ పి చిత్తారంజన్ పరిశీలించారు.వాంకిడి మండలం బెండరా,కెరమెరి మండలం కొఠారి గ్రామాలలో నీ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ పరిశీలించారు.

ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లతో ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.శాంతియుత వాతావరణంలో మొదటి విడత ఎన్నికలు ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల లో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్లో పోలింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.

సమసాత్మక పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసిన ఎస్పీ

ఖానాపూర్, డిసెంబర్ 1౧ (విజయక్రాంతి): మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల  గురువారం స్వయంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పోలీసులు అమలు చేస్తున్న నిఘా చర్యలు, ఓటర్ల రాకపోకల పరిస్థితిపై ఎస్పీ వివరంగా సమీక్ష నిర్వహించారు.

అవసరమైన చోట అదనపు బందోబస్తు, స్ట్రైకింగ్ఫోర్స్ మోహరింపు, సీసీ కెమెరాల పనితీరును కూడా పరిశీలించారు. ప్రజలు నిర్బయంగా, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్శనలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తో పాటు అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి భైంసా ఏ ఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్, పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల పరిశీలన

మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా మొదటి విడత పంచాయితీ ఎన్నికలు

మంచిర్యాల, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియను, కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మొదటి విడత జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. జిల్లాలో గుర్తించిన 24 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.