06-10-2025 12:44:04 AM
-అమెరికా విదేశాంగ సెక్రటరీ మార్కో రూబియో
-ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై వ్యాఖ్య
వాషింగ్టన్, అక్టోబర్ 5: ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధంగా ఇంకా ముగియలేదని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలను హమాస్ సూత్రప్రాయంగా అంగీకరించిందని, త్వరలో హమాస్ బందీలను విడుదల చేస్తుందని అమెరికా విదేశాంగశాఖ సెక్రటరీ మార్కో రూబియో స్పష్టం చేశారు.
బందీల విడుదల కేవలం ట్రంప్ 20 సూత్రాల అమలులో ఒక భాగమేనని, తదుపరి చర్యలపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని తేల్చిచెప్పారు. తాజాగా ఆయన ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. హమాస్ వద్ద ఉన్న బందీలను విడిపించడమే తమ తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. పాలస్తీనా నాయకత్వాన్ని బలపరచడం, ఉగ్రవాద గ్రూప్ నిరాయుధీకరణతోనే శాశ్వత శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు.
అయితే.. అదంత సులభం కాదని, ఇజ్రాయెల్ హమాస్ మధ్య నిర్ణయాత్మక చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. ఆదివారం సాయం త్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు. హమాస్ శాంతి ఒప్పందంపై తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. హమాస్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.