10 August, 2026 | 1:46 AM

ఎల్ నినో ప్రభావం.. సెప్టెంబర్‌లో మరింత అధికం

10-08-2026 12:34 AM

నీటి సంక్షోభం తీవ్రం కానుంది... వరి సాగు మానుకొని ప్రత్యామ్నాయ పంటలను పండించాలి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

కోరుట్ల/జగిత్యాల, ఆగస్టు 9 (విజయక్రాంతి): సెప్టెంబర్ నెలల్లో ఎలినినో ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో రైతులు వరి సాగును విస్తరించకుండా తక్కువ నీటి అవసరం కలిగిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ కోరారు.

వాతావరణ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గడంతో పాటు వర్షాల మధ్య సుదీర్ఘ విరామాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల చెరువుల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా తగ్గిపోవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1,010 చెరువులు ఉండగా ప్రస్తుతం కేవలం 268 చెరువులు మాత్రమే నిండి ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు మొత్తం సాగు అవసరాలను తీర్చేందుకు సరిపోవని వివరించారు.

గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలాల మట్టం ఇప్పటికే సగటున 1.12 మీటర్లు తగ్గిందని, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం మరింత తగ్గితే భూగర్భ జలాలు ఇంకా దిగజారే అవకాశం ఉందన్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున వరి సాగుకు పూర్తిస్థాయిలో నీటి సరఫరాపై ఆధారపడలేమని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రస్తుతం లేదా ఇకపై కొత్తగా వరినాట్లు వేయడం, వరి సాగు విస్తీర్ణాన్ని పెంచడం పూర్తిగా నివారించాలని సూచించారు.