కమనీయం రాములోరి కల్యాణం
- వేడుకకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేత
రూ.౩౫౧ కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వేడుకలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, పలువురు రాష్ట్ర మంత్రులు
భక్తులతో పోటెత్తిన భద్రగిరి
భద్రాద్రి కొత్తగూడెం/భద్రాచలం, మార్చి 27 (విజయక్రాంతి) : భూదేవంత మండపం.. వేదగోష పరిమ ళాలు.. జయ జయ ధ్వానాలు..ఇది..భద్రగిరినా? లేదా దక్షిణ అయోధ్యపురినా?..భక్తుల సంభ్రమాశ్చర్యాలు.. మధ్యాహ్నం12 గంటలకు సాంప్రదాయ అభిజిత్
లగ్నాన రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు. భద్రాచలంలో శుక్రవారం జరిగిన రాములోరి కల్యాణం వైభోగమే.. ముగ్ధ మనోహరమే.. కనులారా తిలకించిన భక్తజన హృదయాలు
ఉప్పొంగాయి.. భద్రగిరి భక్తులతో పోటెత్తింది.
భద్రాచలం దివ్య క్షేత్రంలోని మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబా ల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యంతం భక్తులను కనువిందు చేసింది.శుక్రవారం వేకువజామునే రామాల యంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం నివేదన, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కల్యాణం నిర్వహించారు.
తదుపరి ఉత్సవ మూర్తులకు అలంకారం గావించారు.స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వా మివారిని మిథిలా ప్రాంగణం వద్దకు తీసుకువచ్చారు. శిల్పకళా శోభిత కల్యాణ మండపంపై స్వామివారిని కూ ర్చుండబెట్టి అర్చక స్వాములు కల్యాణ తంతు నిర్వహించారు. తొలుత తిరు కల్యాణ సంకల్పం గావించారు.
విష్వక్సేన పూజ జరిపి, పుణ్యాహవచనం గావించారు. 24 అంగుళాల పొడవు గల 12 దర్బలతో అల్లిన దర్భతాడును సీతమ్మ వారి నడుముకు బిగించారు.రామయ్య కుడి చేతికి సీతమ్మ వారి ఎడమ చేతికి రక్షా సూత్రాలు తొడిగారు. స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింప చేశారు. అనంతరం కన్యాదానం చేశారు.మధ్యాహ్నం 12 గంటలు సమీపించగానే అభిజిత్ లగ్నాన సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు.
జనకమహారాజు, దశరథ మహారాజు తరఫున చేయించిన రెండు మంగళ సూత్రాలు భక్త రామదాసు చేయించిన మరొక మంగళసూత్రంతో కలిపి మొత్తం మూడు సూత్రాలతో మాంగల్యధారణ గావించారు. తదుపరి తలంబ్రాల తం తు జరిపారు.భక్తులు శ్రీరామ జయరామ అంటూ దిక్కు లు పిక్కటిల్లెలా జయ జయ ద్వానాలు చేశారు. భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. స్థానికులు భక్తులకు అన్నదానం, పులిహోర,మజ్జిగ, మంచినీళ్లు,పానకం అందజేసి తమ భక్తి భావాన్ని చాటారు.
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యే క హెలికాప్టర్లో భద్రాచలం తరలివచ్చిన సీఎం తొలుత సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయం వద్ద రూ.351 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి తొలిదశ పనులకు భూమి పూజ నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యేలు డాక్టర్ తె ల్లం వెంకట్రావు, పలువురు న్యాయమూర్తులు,ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా అయ్యర్,
ఎండోమెం ట్ కమిషనర్ హన్మంత రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, పీఓ బి. రాహుల్, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ,భద్రాచలం రామాలయం ఈవో దామోదర్ రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




