28 March, 2026 | 2:58 AM

రెండో భద్రాద్రిలా రామగిరి అభివృద్ధి

28-03-2026 12:44 AM

వచ్చే వైకుంఠ ఏకాదశికి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ః మంత్రి కోమటిరెడ్డి

శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలు అందజేసిన మేయర్ 

నల్లగొండ టౌన్, మార్చి 27: రెండవ భద్రాద్రిగా పేరుగాంచే స్థాయిలో రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  అన్నారు.

శుక్రవారం నల్గొండ పట్టణంలోని రామగిరి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భముగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలుఅందజేశారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తమ నివాసం నుంచి బాజా బాజా భజంత్రీలతో  స్వామివారి కల్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. స్వామివారి కల్యాణో త్సవం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణ తంతును భక్తులు కనులారా తిలకించారు.

తదుపరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మీడియాతో మాట్లాడుతూ రామగిరి దేవాలయానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారని రెండవ భద్రాద్రిగా పేరు స్వార్ధకం అయ్యేలా రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.దర్శన మార్గాల విస్తరణ కోసం అవసరమైన స్థల సేకరణకై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

 దేవాలయ భూములకు ఇబ్బంది కాకుండా నేషనల్ హైవే మార్గాన్ని బైపాస్ ద్వారా మళ్లించామని పేర్కొన్నారు. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారంతో రామగిరి రామాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఉత్తర ద్వార దర్శనానికి కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ధర్మకర్తలు, ఆలయ ఈవో జయరామయ్య, స్థానిక కార్పొరేటర్ యామ కవితా దయాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ , తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి,47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్, అర్చకులు షటారి ,రఘు ,గిరి, పలువురు కార్పొరేటర్లు, ఈశ్వర్ రెడ్డి, రాజేష్ ,సుజాత, బోనగిరి ప్రభాకర్, వంగాల అనిల్ రెడ్డి, పాదం అనిల్ భక్తులు ,ప్రజలు పాల్గొన్నారు.