20-01-2026 12:39:09 AM
చింతకాని సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, జనవరి 19 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో లక్షా 98 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాధనకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం చింతకాని మండలం వందనం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. 2500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూ. 35.75 లక్షలతో చేపట్టిన కొదుమూరు-వందనం ఎత్తిపోతల రెండవ విడత పనులకు, రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొదుమూరు- వంద నం లిఫ్ట్ పనులు గతంలో పూర్తి చేసి 2500 ఎకరాలకు 2013 ప్రాంతంలో సాగు నీరు అందించామని అన్నారు. చింతకాని మండ లం చుట్టు నాగార్జున సాగర్ నీళ్ళు ఉన్నప్పటికి కొదుమూరు, వందనం రైతులు సాగు నీరు అందక ఇబ్బందులు పడ్డారని, వీరి ఆవేదన పరిశీలించి 2009 లో ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో మొదటి విడత లిఫ్ట్ పూర్తి చేశామని అన్నారు.
కొదుమూరు వందనం లిఫ్ట్ కారణంగా ఎండాకాలంలో కూడా నీరు అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరో 2,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కొదుమూరు వందనం లిఫ్ట్ రెండవ ఫేజ్ కు శ్రీకారం చుట్టామని అన్నారు. జిల్లాలో 2 లక్షల 79 వేల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి రాష్ట్రంలో కల్పించామని అన్నారు. ప్రజా ప్రభుత్వం నేడు మరో లక్షా 98 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాధించేందుకు ప్రణాళికలు తయారు చేశామని అన్నారు.
మున్నేరు పాలేరు లింకు కెనాల్ ద్వారా లక్షా 38 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, జవహర్ లిఫ్ట్ క్రింద 33 వేల 25 ఎకరాలు, రాజీవ్ ఫీడర్ కెనాల్ ద్వారా 23 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొదుమూరు వందనం లిఫ్ట్ ద్వారా 2500 ఎకరా లు, మంచుకొండ లిఫ్ట్ ద్వారా 2412 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించే పనులు చేపట్టామని అన్నారు. వ్యవసాయ రంగంపై గత 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం రూ. 74,163 కోట్లతో ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. మధిర అసెంబ్లీ 5 మండలాల పరిధిలో కట్టలేరు, మున్నేరు, వైరా నది జలాలు వృథాగా పోకుండా ఆనకట్టలు కట్టిస్తున్నామని అన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఎటువంటి రాబందులు, గద్దలు ప్రజా సొమ్ము కాజేయకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్త కళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు.