25 July, 2026 | 10:39 AM

ఊరంతా ఒక న్యాయం.. మాకో న్యాయమా!

31-05-2024 01:50 AM

గ్రామంలో ఎక్కడా లేని పానాది మా భూమిలోనే ఎందుకు కనిపిస్తుంది

సర్వేయర్ కొందరితో కలిసి మమ్మల్ని బెదిరింపులకు గురిచేస్తున్నారు

గజ్వేల్, మే 30 : గ్రామంలో రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారిలాగే తమకు న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రైతు అనసూయ అధికారులను వేడుకుంది. గురువారం కొత్తూరులో ఆమె విలేకరులతో తమకు అన్యాయం జరుగుతుందంటూ తన గోడును వెల్లబోసుకుంది. కొత్తూరు గ్రామానికి చెందిన బూరం అనసూయ తమకు సర్వే నంబర్ 461లో 32 గుంటల భూమి ఉండగా 50 ఏండ్ల క్రితం రోడ్డు విస్తరణలో చాలా వరకు కోల్పోయామని వెల్లడించింది.

మిగిలిన కాస్తంత భూమిలో నుంచి గతంలో పానాది ఉండేదని కొద్దిమంది గ్రామస్తులు పలుమార్లు గొడవకు వచ్చారని, ఈ విషయమై కోర్టుని సైతం ఆశ్రయించి వెనుదిరిగారన్నారు. ఇప్పుడేమో రెవెన్యూ సర్వేయర్‌ను తీసుకొచ్చి ఏకంగా పానాది పేరిట హద్దులు పాతి తమ కుటుంబాన్ని భయాందోళనకు గురిచేస్తున్నారని రైతు అనసూయ, కుమారుడు బూరం రమేశ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.

మా భూమిలో పానాది ఉన్నట్టయితే ముందు, తర్వాత భూమిలో కూడా పానాది ఉంటుంది కదా అని  అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని రైతు బూరం అనసూయ కోరారు. లేని పక్షంలో సర్వేయర్ మా కుటుంబానికి చేసిన నష్టానికి ఇంటిల్లిపాదికి ఆత్మహత్యే శరణ్యమవుతుందని కన్నీరుమున్నీరయ్యారు.