12 April, 2026 | 1:22 AM

మహిళా బిల్లు కొత్త యుగానికి నాంది

12-04-2026 12:00 AM
  1. 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లుపై చర్చ

రాష్ట్రం నుంచి 9 మంది మహిళా ఎంపీల ప్రాతినిధ్యం

పార్టీలకు అతీతంగా దీనికి అందరూ సహకరించాలి

బీజేపీ ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం ఒక చట్టం కాదు.. కోట్లాది మహిళల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక అని, దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పలికే బిల్లు అని బీజేపీ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును అమలుచేయాలనే చిత్తశుద్ధి తో కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. బీజే పీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చ జరగనుందన్నారు.

ఈ బిల్లు అమల్లోకి వస్తే తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానాలు 26కు పెరుగుతాయని, అందులో 9 మంది మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. తెలంగాణలోనే మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నదని, ఈ బిల్లు అమలైతే, డిలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో ఎంపీ స్థానాలు పెరిగి, దాదాపు 9 మంది మహిళలు పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 273 మంది మహిళ లకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు.

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే, దాదాపు 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా గణనీయ ప్రాతినిధ్యం లభిస్తుందని, ఈ రిజర్వేషన్ మూడు టర్ములు అంటే దాదాపు 15 సంవత్సరాలు అమలులో ఉండే అవకాశం ఉందని చెప్పా రు. నారీశక్తి వందన్ అధినియమ్ ద్వారా మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని, 2029 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.

గత ప్రభుత్వాలు దీనిపై చిత్తశుద్ధి చూపలేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ అన్ని పార్టీలను సమన్వయం చేసి ఈ బిల్లును తీసుకురావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అన్ని పార్టీల ఎంపీలు పార్టీలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలుగా మహిళా సాధికారత గురించి మాట్లాడినా, చట్టసభల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైందని,

అంతేకాకుండా ఈ బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ద్వారా వారి నిజమైన వైఖరి బయటపడుతోందన్నారు. సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు.