02-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): ఈ యేడాది ఇంజినీరింగ్ సీట్ల పెంపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఉన్న సీట్లనే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయా లని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ సీట్లు సరిపడా ఉండటం, ఉన్న సీట్లలోనే భారీ స్థాయిలో సీట్లు మిగులుతుండటంతో మళ్లీ కొత్త సీట్లు ఎందుకనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
పైగా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పదేండ్ల పాటు తెలంగాణలోని విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థుల ప్రవేశాల కోటా గడువు ముగియడంతో ఆ సీట్లూ మనకే దక్కనున్నాయి. గతంలో 85 శాతం సీట్లు మనకు, 15 శాతం ఏపీ కోటా సీట్లు కేటాయించేవారు. కొత్త విద్యాసంవత్సరం నుంచి మొత్తం సీట్లు తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త సీట్లు ఎందుకనే యోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం.
రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో మొత్తం 1,12,069 సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లు భర్తీ చేస్తారు. ఇక మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా లో నింపుతారు.
అలాగే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ కోటా గడువు పదేళ్లు కూడా ముగియడంతో 95 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు. మిగిలిన 5 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పదేండ్ల పాటు ఇక్కడ నివాసమున్న వారి పిల్లలు, స్థానికులైన వారి భార్యలు, భర్తలకు దక్కనున్నాయి.
భారీగా మిగులుతున్న సీట్లు
ఇంజినీరింగ్‌లో యేటా ఎన్నో కొన్ని సీట్లు భర్తీ మిగులుతున్నాయి. ఈసారి ఏపీ విద్యార్థుల పోటీ తగ్గడంతో మళ్లీ కొంత సీట్లు మిగలనున్నాయి. అస లు 90 శాతం సీట్లయినా భర్తీ అవుతాయా? లేదా? అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో భారీగానే సీట్లు మిగులుతున్నాయి. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ సీట్లు ఖాళీగా ఉంటున్నాయి.
యేటా ఇంజినీరింగ్ సీట్ల కౌన్సెలింగ్‌ను మూడు విడుతల్లో చేపడుతున్నారు. అయినా అన్ని సీట్లు నిండటంలేదు. 2020 180 కాలేజీలుండగా, వీటిలో మొత్తం 98,988 సీట్లున్నాయి. అయితే వీటిలో కేవలం 65,720 సీట్లు మాత్రమే నిండాయి. అంటే ఆ ఏడా ది 33,268 సీట్లు మిగిలాయి. 2021 మొత్తం 175 కాలేజీల్లో 1,09,773 సీట్లకు భర్తీ అయినవి 77,700 మాత్రమే. 2020 2021 నాటికి కాలేజీల సంఖ్య తగ్గినప్పటికీ సీట్లు నిండలేదు. 2022 విద్యాసంవత్సరంలో 1,08,715 సీట్లకు 82,350 మాత్రమే నిండాయి. 2023 ఏడాదిలో గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా సీట్ల సంఖ్యను పెంచారు.
1,17,426 సీట్లకు 91,001 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 26,425 సీట్లు అలాగే మిగిలిపోయాయి. 2024 మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,12,069 సీట్లకు లక్ష వరకు సీట్లు నిండినట్టు సమాచారం. ఇలా ఈ నాలుగేళ్లలో దాదాపుగా లక్షా 15 వేల వరకు సీట్లు మిగిలాయి. 2025 విద్యాసంవత్సరానికి కూడా ఇవే సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.