calender_icon.png 3 May, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల

02-05-2025 03:23:54 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (Degree Online Services Telangana) 2025 నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మూడు విడుతల్లో డిగ్రీ ప్రవేశాలు జరగనున్నాయి. మొదటి దశ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ శనివారం నుండి ప్రారంభమవుతుంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి(Telangana Council of Higher Education) ఛైర్మన్, దోస్త్ కన్వర్నర్ ప్రొఫెసర్ వీ. బాలకిష్ట రెడ్డి, కాలేజియేట్ విద్యా కమిషనర్ ఏ. శ్రీదేవసేన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రూ.200 రుసుముతో మొదటి దశ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 21. https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 10 నుండి 22 వరకు వెబ్ ఆప్షన్లు వేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ (PH/CAP/NCC/ క్రీడలు/పాఠ్యేతర కార్యకలాపాలు) కింద అడ్మిషన్ పొందే అభ్యర్థులు మే 21- 22 తేదీల్లో యూనివర్సిటీ హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.  

మొదటి దశ అడ్మిషన్లలో పాల్గొన్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు మే 29న జరుగుతుంది. సీటు పొందిన అభ్యర్థులు మే 30 నుంచి జూన్ 6 మధ్య ఆన్‌లైన్‌లో స్వీయ-రిపోర్ట్ చేయాలి. మే 30 నుంచి జూన్ 8 వరకు రెండో ఫేజ్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. జూన్ 13న రెండో ఫేజ్ సీట్లు కేటాయించనున్నారు. జూన్ 13 నుంచి జూన్ 19 వరకు మూడో ఫేజ్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 13 నుంచి జూన్ 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. జూన్ 23న మూడో ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. మూడు దశల అడ్మిషన్ల తర్వాత, విద్యార్థులకు ఓరియంటేషన్ సెషన్‌లు జూన్ 24 నుండి 28 వరకు జరుగుతాయి. మొదటి సెమిస్టర్ తరగతి పని జూన్ 30న ప్రారంభమవుతుంది. టీజీసీహెచ్ఈ(Telangana Council of Higher Education) వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ బాల భాస్కర్ ఇతర అధికారులు దోస్త్ నోటిఫికేషన్ విడుదలలో పాల్గొన్నారు.