14 March, 2026 | 4:28 AM

ఎల్‌పీజీ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు

14-03-2026 12:45 AM

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ మార్చి 13(విజయ క్రాంతి) :మెదక్ జిల్లాల్లో గృహావసరాలకు ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత  లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  3,84373 కనెక్షన్లు కలవని16 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో అక్రమ గ్యాస్ నిల్వలపై దాడులు నిర్వహించి 44 సిలిండర్లను సీజ్ చేశామని వెల్లడించారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి అడ్వాన్సు గా బుకింగ్ చేసుకోవద్దనీ జిల్లా కలెక్టర్  సూచించారు.

జిల్లాలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా సాధారణంగా మరియు నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు.ప్రభుత్వ హాస్పిటల్లో, హాస్టల్లో, ఓల్ ఏజ్ హోమ్ లో, పాఠశాలల్లో, అత్యవసర సేవలలో గ్యాస్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం,అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేశామన్నారు.

జిల్లాలో ఎక్కడైనా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగే పరిస్థితులు లేదా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన పక్షంలో, సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు  కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో గ్యాస్ కొరత ఉందని వదంతులు పుట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద, డిపిఆర్‌ఓ రామచంద్ర రాజు, ఏపీఆర్‌ఓ బాబురావు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.