కమీషన్ల కోసమే టెండర్లలో జాప్యం
- మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్
కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్
ముకరంపురా, మార్చి 13 (విజయక్రాంతి): నగరపాలక సంస్థ పాలకవర్గం కమీషన్ల కోసమే టెండర్లలో జాప్యం చేస్తుందని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణను ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల యం త్రాంగం మొత్తాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి మౌలిక సదుపాయాలు ప్రజల సమస్యలపై ఆరా తీయాలని పేర్కొన్నారు.
ఇటీవలే సి డి ఎం ఏ అక్టోబర్ 25న 2025 లో జీవో 715 విడుదల చేశారని ... జీవో ప్రకారం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పథకం కింద నగరంలో చేపట్టనున్న 87 అభివృద్ధి పనులకు 50 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందనీ తెలిపారు. కరీంనగర్ నగర పాలక సంస్థలో కొత్తగా విలీనమైన గ్రామాలకు రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పలు పనులు చేపట్టనున్నట్లు జీవోలో పేర్కొన్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని సమయంలోనే జనవరి 17, 2026 లో టెండర్లు పిలిచి కట్టబెట్టిన ఇప్పటికీ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం బేరసారాల ప్రభుత్వమా? కేంద్ర మంత్రి బండి సంజయ్ 10% కమిషన్ల కోసం బేరసారాలు చేస్తూ టెండర్లు ఓపెన్ చేయడం లేదా అంటూ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కమిషన్ల కోసం నగరపాలక సంస్థలో విలీన గ్రామాల అభివృద్ధి విషయంలో ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే అభివృద్ధికి ఎల్ వో ఏ అందజేయాలని, కార్పొరేషన్ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. కరీంనగర్ జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులు వెంటనే పనులపై శ్రద్ధ చూపాలని ఆయన కోరారు.




