తండ్రి ప్రేమకు సాటి లేదు..
- 16 ఏళ్ల యువ క్రికెటర్‌కు మూత్రపిండం దానం చేసిన తండ్రి
- ఏఐఎన్‌యూలో వైద్యుల శస్త్రచికిత్స
హైదరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి): తండ్రి ప్రేమకు, వైద్యుల నైపుణ్యానికి అద్దం పట్టే సంఘటన ఇది. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి, వర్ధమాన బౌలర్‌కు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు విజయవంతంగా ‘ప్రీ-ఎంటివ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’ (డయాలసిస్ అవసరం లేకుండానే చేసే మూత్రపిండ మార్పిడి) నిర్వహించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
ఈ ప్రాణరక్షణ ప్రక్రియలో బాలుడి తండ్రి తన ఒక మూత్రపిండాన్ని దానం చేసి పితృప్రేమను చాటుకున్నారు. ఆ యువకుడు, పుట్టుకతోనే మూత్రనాళ సమస్య తో బాధపడుతుండేవాడు. దీనివల్ల మూత్రం వెనక్కి ప్రవహించి (యూరినరీ రిఫ్లక్స్) క్రమంగా కిడ్నీల పనితీరు దెబ్బతింది. శారీరక ఎదుగుదల ఆగిపోయి, చివరకు పరిస్థితి తీవ్రరూపం దాల్చి ‘ఎండ్-స్టేజ్ రీనల్ డిసీజ్’కి దారితీసింది.దీర్ఘకాలిక డయాలసిస్ సమస్య నుంచి కాపాడేందుకు, ముందుజాగ్రత్త చర్యగా ‘ప్రీ-ఎంటివ్ కిడ్నీ ట్రాన్‌ప్లాంటేషన్’ చేయాలని వైద్యులు సూచించారు.
విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి ఖాజా అసీముద్దీన్, ఏమాత్రం సంకోచించకుండా తన మూత్రపిండాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.అన్ని రకాల క్లినికల్ పరీక్షలు, డానర్ మ్యాచింగ్ పూర్తయిన తర్వాత, 2026 జూన్ 17న శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతర సంరక్షణ తర్వాత, రోగి వేగంగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.ఈ సందర్భంగా బాలుడి తండ్రి ఖాజా అసీముద్దీన్ మాట్లాడుతూ నా కుమారుడిని కాపాడుకోవడానికి కిడ్నీ ఇవ్వడం తండ్రిగా నా బాధ్యత.
అతడు వేగంగా కోలుకోవడం చూస్తుంటే, మళ్లీ చదువుల్లో, క్రికెట్‌లో రాణిస్తాడనే నమ్మకం కలుగుతోంది అన్నారు.ఏఐఎన్‌యూ బంజారాహిల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి మాట్లాడుతూ మహమ్మద్‌కి చేసిన ఈ విజయవంతమైన శస్త్రచికిత్స, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం, తండ్రి ఉదారత కలసి ఒక వికసిస్తున్న జీవితానికి ఎలా వెలుగునివ్వవచ్చో నిరూపించింది అని తెలిపారు.
కిడ్నీ మార్పిడి గురించి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున సి మాట్లాడుతూ బాధితులకు డయాలసిస్ ప్రారంభమయ్యేంత వరకు వేచి చూడకుండా, దాతల ఎంపిక, శస్త్రచికిత్స ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
వ్యాధి తీవ్రతను, దాని పురోగతిని ప్రారంభంలోనే గుర్తించి, డయాలసిస్ అవసరం పడకముందే సరైన సమయంలో మార్పిడి శస్త్రచికిత్స చేయడంపై దృష్టి సారించాలి. రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా, మెరుగ్గా ఉన్నప్పుడే సరైన సమయంలో మార్పిడి శస్త్రచికిత్స పూర్తి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అన్నారు.






