అధికారిక కార్యక్రమాలకు నన్ను దూరం పెడుతున్నారు
మంత్రి శ్రీధర్‌బాబు సీట్లో కూర్చొని ఎమ్మెల్యే కాటెపల్లి నిరసన
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తూ రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు కామారెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు తనను దూరం పెడుతున్నారని ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
సోమవారం ఈ మేరకు అసెంబ్లీలో ఎమ్మెల్యే తనకు కేటాయించిన సీట్లో కూర్చోకుండా, కాసేపు మంత్రి శ్రీధర్‌బాబు సీట్లో కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎనిమిది నెలలుగా తనకు అడుగడుగునా అవమానం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై గతంలోనే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయారు.
ప్రొటోకాల్ వివాదంపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. ప్రొటోకాల్ ఉల్లంఘన అంశంపై చర్చను ఆహ్వానిస్తున్నామని, అందుకు ప్రత్యేక చర్చకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరుతున్నామన్నారు. మరోవైపు ప్రొటోకాల్ వివాదంపై బీజేపీ స్పందించింది. ‘ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాబలంతో గెలిచిన ఎమ్మెల్యేను అవమానించడం కాంగ్రెస్ నేతల నైజం అయితే..
అలాంటి వారికి బుద్ధి చెప్పడం బీజేపీ నాయకుల ధర్మం’ అంటూ ‘ఎమ్మెల్యే’ పోస్ట్ చేశారు. నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగానే అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యేను దూరం పెడుతున్నారని పేర్కొన్నారు. ఇదే సందేశాన్ని బీజేపీ కూడా అధికారికంగా రీట్వీట్ చేసింది.






