16-10-2025 02:28:57 AM
-కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు
-జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ వచ్చుడే కష్టం
-తెలంగాణ గొంతు నొక్కడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే
-మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను, ఆమె కన్నీల్లను, వారి పిల్లలను అవమానిస్తుండ్రని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నాయకులు విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు విజ్ఞులని, వారు మంచి, చెడు ఆలోచిస్తారని హిత వు పలికారు. బుధవారం మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో బీజేపీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచిం చాలని, తెలంగాణ విషయంలో ఆ రెండు పార్టీలూ ద్రోహం చేశాయని అన్నారు. హస్తం, కమలం పార్టీలూ చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శించారు. రాహుల్ గాంధీ మొహబ్బత్‌కి దుకాణ్ అని, మోదీ సబ్ కా సాత్ సబ్కా వికాస్ అంటారని.. కానీ జరుగుతున్నది వేరన్నారు. కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్లనే ఉంటది.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు హైడ్రాలనే ఉంటది.
ఎమ్మెల్యే గాంధీ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకుని ఉంటారు, అయినా వారి ఇళ్లను కూలగొట్టరని విమర్శించారు. పండుగ పూట, ఆదివారం రాత్రి వచ్చి గరీబోళ్ల ఇళ్లు కూలగొట్టి వేల కుటుంబాలను రేవంత్‌రెడ్డి రోడ్డుమీదికి తీసుకొ చ్చినా రాహుల్‌గాందీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాహుల్ గాంధీ బీహార్‌లో ఓట్ చోరీ అంటున్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటు చోరీ చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో ఓడిస్తేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుం దన్నారు. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని సోనియా గాంధీ, రాహు ల్ గాంధీతో చెప్పించారని, కానీ ఇప్పుడు వారు పత్తాకు లేరని విమర్శించారు.
జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ వచ్చుడే కష్టమన్నారు. గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు ఇచ్చి తెలంగాణకు గుండుసున్నా ఇచ్చారని, ఇది సబ్‌కా సాత్ సబ్కా వికాస్ అవుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ నీటిని దోపిడీ చేసే బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర బీజేపీ మద్దతిచ్చి అనుమతులు ఇస్తున్నదని ఆరోపించారు. ఆంధ్రప్ర దేశ్‌కు బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన బీజేపీ తెలంగాణకు పది పైసలు కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీకి 8 ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ‘మీరు చేసిన మంచి ఇదేనా’ అని ప్రశ్నించారు. ఉత్తర భారత దేశంలో అయినా తెలంగాణలో అయినా రైతు రైతే అన్నారు.
గోధుమలకు మద్దతు ధర పెంచి వడ్లకు పెంచకపోవడం తెలంగాణ రైతులకు అన్యాయం చేయడమే అన్నారు. వడ్లు పండించడం తెలంగాణ రైతులకు శాపమా అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గొంతు నొక్కడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్‌ఎస్ అని, కేసీఆర్, బీఆర్‌ఎస్ వల్లనే హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్‌వి మొసలి కన్నీళ్లు, ఆపద మొక్కులు తప్ప ప్రజల సంక్షేమం లేదన్నారు. కాంగ్రెస్‌కి నిజాయితీ ఉంటే బాకీ కార్డు పంపిస్తామని, మీరు పడ్డ బాకీని చెల్లించి జూబ్లీహిల్స్ లో ఓటు అడగాలని సూచించారు.