వీధి వ్యాపారస్తులకు అండగా ఉంటా
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి, మే 21 : రెక్కాడితే కాని డొక్కాడని వీధి వ్యాపారస్తులు ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన షాపులను అధికారులు తొలగించడంపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. మంగళవారం కేపీహెచ్‌బి కాలనీ ఎమ్మార్వో ఆఫీస్‌రోడ్‌లో అధికారులు తొలగించిన షాపులను పరిశీలించి వారికి మనోస్థుర్యైన్ని కల్పించారు. ముందస్తు సమాచారం లేకుండా వ్యాపారాలను తొలగించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి వ్యాపారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వారి షాపులను తొలగించడంతో అనేక 200 కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. పక్కనే ఉన్న లూలూ మాల్‌కి కొమ్ము కాసే విధంగా స్థానిక ట్రాఫిక్ సిఐతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు వారికి లబ్ధి చేకూరుస్తున్నారని దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వీధి వ్యాపారస్తులకు న్యాయం చేయకపోతే బాధిత కుటుంబాలకు తాను అండగా ఉండి వారి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.






