18 April, 2026 | 7:07 AM

మార్కెట్ యార్డుల్లో దొంగల బీభత్సం

16-05-2025 12:00 AM

-జొన్న పంటను దొంగలించేందుకు వచ్చిన దొంగలు

-అడ్డుకున్న రైతులపై దాడి ఇద్దరికి తీవ్ర గాయాలు

-దాడిని ఖండించిన మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, మే 15 (విజయ క్రాంతి) : ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆరుగాలం కష్టించి రైతన్న లు పండించిన జొన్న పంటను దొంగలించేందుకు వచ్చిన దొం గలు రైతులపై దాడికి చేసి, తీవ్రంగా గాయపరచడం కలకలం రేపింది. పండించిన జొన్న పంటను అమ్ముకునేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు పంటను తీసుకువచ్చారు.

అయితే గత రాత్రి రైతులు అక్కడే నిద్రిస్తున్న సమయంలో కొం దరు వ్యక్తులు వచ్చి జొన్న పంటను దొంగలించేందుకు యత్నించగా వారిని రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులు దొంగల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పంట దొంగలించడానికి వచ్చిన వ్యక్తులు రైతులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బరంపూర్ గ్రామానికి చెందిన నారాయణ,  రాంపూర్ గ్రామానికి చెందిన దిలీప్ అనే రైతుల తలకు తీవ్ర గాయాలయ్యాయి.

మార్కెట్ యార్డులో భద్రత చర్యలు లేని కారణంగా రైతులపై దాడులు జరుగుతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను దొంగలించేందుకు యత్నించాడం లాంటి ఘటనలు  గతంలో సైతం జరిగాయని, కానీ ఈసారి ఏకంగా రైతులపై దాడి చేయడం అమానుషమైన చర్య అన్నారు. 

రైతులను నిర్లక్ష్యం చేస్తే సహించం

రైతులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారు పండించిన పంటలకు సైతం రక్షణ లేకుండా పోతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. మార్కెట్ యార్డ్‌లో జొన్నల కొనుగోళ్ళు జరుగుతున్న నేపథ్యంలో గత రాత్రి కొంతమంది రైతులపై దాడికి పాల్పడ్డా విషయాన్ని తెలుసుకొని మార్కెట్ యార్డ్ కు వెళ్లి గాయపడి రైతులను మాజీ మంత్రి  పరామర్శించి, జొన్న పంట విక్రయాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.