తిమ్మరాజుపల్లి టీవీ.. ప్రతి ఊరి కథ
కొత్తవారిని ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ చిత్రంతో సాయితేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇదే సినిమాతో వీ మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వీ మునిరాజు చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.
* దర్శకుడు కావాలనేది నా కల. ఇండస్ట్రీకి వచ్చాక జాబ్ కోసం ఆన్‌లైన్ ఎడిటింగ్ చేస్తుంటే డైరెక్షన్ అనే కలకు దూరంగా ఉండిపోతున్నాననిపించింది. అందుకే ఒక స్క్రిప్ట్ రాసుకొని, ఊరికి వెళ్లి అక్కడి వాళ్లతో డెమో షూట్ చేశా. తిరిగొచ్చి ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయించా. ఆ తర్వాత ‘మీటర్’ మూవీ షూటింగ్ టైమ్‌లో కిరణ్ అబ్బవరం పరిచయమయ్యారు. ఈ క్రమంలో నా డెమో మూవీ, స్క్రిప్టు గురించి చెప్పా. పూర్తిస్థాయిలో సిద్ధం చెయ్ చూద్దాం అన్నారు. అలా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వైపు తొలి అడుగులుపడ్డాయి.
* ఈతరం జెన్ జీ కిడ్స్‌కు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈతరం పిల్లలకు అప్పటి రోజులు, సంప్రదాయాలు తెలియవు. కాబట్టి మా సినిమాలోని వాతావరణం అంతా వాళ్లకు కొత్తగా ఉంటుంది.
* నేను తెరపై ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు అది నా ఊరి కథే ఎందు కు కాకూడదు అనిపించింది. ఈ కథకు స్ఫూర్తి నేను చిన్న ప్పుడు చూసిన ఘటనలే. నేను చూసిన మనుషుల క్యారెక్టర్లు, భావోద్వేగాలు, నా చిన్నప్పటి అనుభవాల న్నీ సినిమాగా తీశాను. ఇది ప్రతి ఊరి కథ. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీవీ నేపథ్యంగా నేను చూ సిన ఘటనలు చూసే ఉంటారు. ఊరి మనుషులు, వారి మధ్య అహం వంటి అంశాలు చూపిస్తూనే చివరలో మంచి ఎమోషనల్ కంటెంట్ చెబుతున్నాం.
* రాయలసీమ నేపథ్యంగా కథ సాగుతుంది. మా ఊరు తిమ్మరాజుపల్లి. అదే ఊరిలో రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. ఫ్యూర్ సస్పెన్స్ డ్రామా చిత్రమిది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు తర్వాత ఏం జరుగుతుందంటూ సీటు అంచున కూర్చుని చూస్తారు. మంచి ఎమోషనల్ ఫీల్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు.
* సాధ్యమైనంత సహజ సిద్ధమైన వాతావారణంలో ఈ సినిమా తెరకెక్కించా. మేకింగ్ పరంగా మా సినిమా ఆశ్చర్యపరుస్తుంది. ఆరేడు నిమిషాల సింగిల్ టేక్ సీన్స్ చేశాం. కిరణ్ అబ్బవరం నాపై పెట్టుకున్న నమ్మకంతో మరింత బాధ్యతగా సినిమా తెరకెక్కించా. కొత్త వాళ్లం మేము చేసిన ఈ సినిమా న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్‌గా పేరు తెచ్చుకుంటుంది.
* ప్రస్తుతం ఐదారు కథలు సిద్ధం చేసుకున్నా. మన చుట్టూ ఉన్న కథలనే తెరకెక్కించా లనేది నా కోరిక.






