ఇదో తుక్కు టెండర్!
2 వేల కోట్ల విలువెన స్క్రాప్ 485 కోట్లకే..
- కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారం కూల్చివేత కుంభకోణం!
- విలువైన సొత్తును తక్కువ ధరకే ధారాదత్తం చేసినట్లు గత సర్కారుపై విమర్శలు
- కేంద్ర విద్యుత్ వనరుల శాఖ ఆదేశాలు బేఖాతర్
- ముడుపుల కోసమే కూల్చివేశారంటూ కార్మికవర్గాల్లో గుసగుసలు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 26 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారం కూల్చివేత టెండర్లలో భారీ ఎత్తున గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.2వేల కోట్ల విలువగల స్క్రాప్‌ను రూ.485 కోట్లకే ధారాదత్తం చేశారని విమర్శలు ఉన్నాయి. ఈ టెండర్లలో రూ. వందల కోట్ల ప్రజాధనం లూటీ జరిగిందని గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పుమన్నాయి. మరోపక్క కేంద్ర విద్యుత్ వనరుల శాఖ ఆదేశాలను సైతం బేఖాతరు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు కథ ఏంటంటే?
దేశంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఆశించిన రీతిలో లేదని భావించిన కేంద్ర విద్యుత్ వనరులశాఖ దేశంలో మూసివేయాల్సిన థర్మల్ ప్లాంట్స్‌ను 2030 వరకు కూల్చివేయవద్దని 2023, జనవరి 20న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన అప్పటి పాలకులు, ఉన్నతాధికారులు తమ ముడుపులకు గండి పడుతుందని భావించి ఉత్తర్వులు వచ్చే రెండు రోజుల ముందు 2023, జనవరి 18నే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని 720 మెగావాట్ల సామర్థ్యం కల్గిన కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారం కూల్చివేతకు శ్రీకారం చుట్టారని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి గండి పెట్టడమే కాకుండా, రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకొన్నారని, ఆ సమయంలో కార్మికులు, కార్మిక సంఘాలు ప్రశ్నిస్తే వారిపై శాఖాపరమైన చర్యలకు పూనుకున్నట్లు కూడా తెలుస్తోంది.
ఓఅండ్‌ఎం కూల్చివేస్తేనే 800 మెగావాట్లకు అనుమతి
ధర్మల్ విద్యుత్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు, భూమి, నీరు సమృద్ధిగా ఉందని, పాల్వంచకు 800 మెగావాట్ల సామర్థ్యం కల్గిన ప్లాంట్ నిర్మాణానికి అనుమతి కోరిన సమయంలో కేంద్ర పర్యావరణ శాఖ పాత ప్లాంట్ అయిన కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారాన్ని కూల్చివేస్తేనే కొత్త ప్లాంటుకు అనుమతిస్తామని షరతు విధించడంతో అప్పటి జెన్‌కో అధికారులు అంగీకరించారు. అదే వారి పాలిట కల్పవృక్షంగా మారింది. దీంతో పాతప్లాంట్‌ను కూల్చివేయడానికి టెండర్లు ఖరారు చేశారు. అక్కడే అక్రమానికి బీజం పడింది.
టెండర్లు పారదర్శకంగా జరగలేదని, తూతూ మంత్రంగా జరిపించి సుమారు రూ. 2వేల కోట్ల విలువగల స్క్రాప్‌ను రూ.485కోట్లకే హెచ్‌ఆర్ కంపెనీకి ధారాదత్తం చేశారని విమర్శలు ఉన్నాయి. పాతప్లాంట్లను కూల్చివేయొద్దనే కేంద్ర విద్యుత్ వనరుల శాఖ ఆదేశాలను విస్మరించి ఓఅండ్‌ఎం ప్లాంటు కూల్చివేయడంలో ఆంతర్యమేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి హుటాహుటిన కూల్చివేతకు అప్పటి జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదేశాలివ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ముడుపుల కోసమే ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారని తెలుస్తోంది.
టెండర్లు లేని ప్రాంతాల్లో తవ్వకాలు
కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారం కూల్చివేత టెండర్‌లో కేవలం ప్లాంటు పరిధిలో గ్రౌండ్ లెవల్‌లోనే తవ్వకాలు చేయాలని ఉంది. కానీ, టెండర్‌లో లేని ప్రాంతాల్లో సైతం తవ్వకాలు చేపట్టడం విస్మయానికి గురి చేస్తోంది. భూమిలోపల తవ్వకాలు చేపట్టి కేబుల్స్ తొలగిస్తున్నారు. అంతేకాదు ప్లాంటు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బూడిదవాగు చెరువుకు వెళ్లే రూ.100 కోట్ల విలువ చేసే మూడు వరుసల పైపులైన్లను తొలగించి తరలించారని తెలుస్తోంది. అసలు టెండర్లలో బూడిదవాగు పైపులైన్ ప్రస్తావనే లేకున్నా.. వాటిని తొలగించడం టెండర్ ముసుగులో భారీ ఎత్తున అక్రమాలు చేటుచేసుకున్నట్లు స్పష్టమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ టెండర్లపై విచారణ చేపడితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కార్మికులు, కార్మిక సంఘాలు చెబుతున్నారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సైతం సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాని కోరారు. విచారణ నివేదిక వచ్చేవరకు పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాని అధికారులు, కాంట్రాక్టర్ ఎమ్మెల్యే మాటలు పెడచెవిన పెట్టి వారి పనులు యథావిథిగా సాగిస్తుండడం కొసమెరుపు.






