మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
- కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారుల సూచన
- పట్టణాల్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం
విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, జూన్ 26: పలు పట్టణాల్లో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు, న్యాయాధికారులు, పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని సూచించారు. మత్తు పదార్థాలు అమ్మినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మాదక ద్రవ్యాలకు అలవాటు పడితో క్రమెపీ ఆరోగ్యం క్షీణించడంతో పాటు వ్యసనంగా మారి, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలన్నారు. తద్వార కుటుంబ సభ్యుల అనుబంధాలకు దూరమవుతారని చెప్పారు. చెడు అలవాట్లకు బానిసై యువత చెడిపోవద్దని సూచించారు. డ్రగ్స్, గంజాయి, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు విక్రయించిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం ప్రచార పోస్టర్లను జిల్లా అధికారులు విడుదల చేశారు.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు, యువతకు ప్రతిజ్ఞ చేయించారు.






