6 April, 2026 | 4:54 AM

కవి అంతరాత్మ ఈ ‘మనాది’

06-04-2026 01:57 AM

‘శాస్త్రవేత్తలు మూలకాలతో ప్రయోగాలు చేసినట్టు, పదాలతో ప్రయోగాలు చేసే సాహసం చేసేవారే మన కాలపు నిజమైన కవులు. వారు సామాజిక బాధలను ఆశాకిరణాలుగా మారుస్తూ, ఇంకా పుట్టని తరాల కోసం బాటలు వేస్తారు’ అంటాడో కవి. సరిగ్గా అలాంటి కోవకు చెందిన కవి జూకంటి జగన్నాథం. నిరంతర అధ్యయనమే తన అంతరాత్మగా మార్చుకొని, ఐదు దశాబ్దాలుగా సాహితీ విశ్వాంతరాలంలో అక్షర నక్షత్రాల పుస్తకాల గెలాక్సీలను పూయిస్తున్నారీ కవి. గాసునూనె దీపం వెలుతురులో కళ్లలో ఒత్తులు వేసుకుని పుస్తకాలు చదవడం.. 40 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామానికి సైకిల్ మీద వెళ్లి పుస్తకాలు తెచ్చుకోవడం.. ఇలాంటివెన్నో జూకంటి జీవితంలోని అనుభవాలు. అంతటి జిజ్ఞాస ఉన్నందునే ఆయనలోని మేలిమి కవి లోకాన్ని చూశాడు. ఆ అనుభవాలన్నీ వారి కవనంలో విస్పష్టంగా దర్శనమిస్తాయి.

అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక సాహిత్యాన్ని, సామాజిక స్పృహను, శాస్త్ర సాంకేతికతను అర్థం చేసుకుంటూ జూకంటి అచ్చమైన తెలంగాణ యాసలో సమాజ హితం కోసం కవితాధారలు కురుపిస్తూనే ఉన్నారు. వారి మొదటి కవిత్వ పుస్తకం ‘పాతాళ గరిగె‘ 1993లో అచ్చయింది. వారి తాజా కవితల సంకలనం ‘మనాది’. ఈ పుస్తకం వారి 18వ సంకలనం. పుస్తకంలోని 2025 జనవరి 16 నుంచి ఇదే ఏడాది ఫిబ్రవరి 14 వరకు రాసినవి. అంటే కవితలు 30 రోజుల్లో 30 కవితలు రాశారన్న మాట. ఇలా ఒక నూతన పంథాను అనుసరిస్తూ కవితలు వెలువడటం తెలుగు సాహిత్య రంగంలో కొత్త ప్రక్రియ. సంకలనంలో ప్రయోయోగాత్మకంగా కవి కవితా సౌధాలు నిర్మించారు.

‘పడమర సూర్యున్ని ప్రయాసతో/ మోస్తున్న వృద్ధ ఆకాశానికి అడ్డంగా పక్షుల గుంపు ఒకటి ఎగురుతుంటే/ ఉరుములు మెరుపుల రాగం తీస్తూ ఆకాశంలో ఈదుతుంటే/ రుద్ద గీతం ఆలపిస్తున్న మార్కెటింగ్ విధానం వృద్ధ ఆకాశమై’ అంటూ కవి తన మొదటి కవితలో బెంగపడతారు. రేడియోలు, ట్రాన్సిస్టర్లు, ధ్వని తరంగాలు, హనుమాన్ చాలీసా, చలం ఊర్వశి నాటిక, ఉగాది కవి సమ్మేళనాలు వంటి విభిన్న పదాల ప్రయోగాలతో కవి ఆకట్టుకున్నారు. టీవీ కోపంగా కన్ను తెరవడం ప్రత్యక్షంగా చూస్తూ శుభరాత్రి కి సెలవులు ప్రకటించారు అంటారు ఒకచోట.

కాగితం మీద కందిపప్పు ఒప్పందాల అవగాహన పత్రాలతో బ్లర్బ్‌కు అక్షర రూపమిచ్చారు. సుతారంగా కనుగుడ్లను ఒడుపుగా మాయం చేసే కాలం సాక్షిగా పూల బొకే లాంటి చక్కెరపూత సంభాషణలను అందంగా ప్రదర్శించారు. వలస కూలీల జీవన చిత్రాలను ఒక కవితలో చిత్రించారు. కళ్లముందే వ్యవసాయ భూమి రియల్ ఎస్టేట్‌గా మారుతుంటే, రైతులు తమ చిరునామాలు కోల్పోయిన విధానాన్ని కవిత్వంలో హృద్యంగా మలిచారు. మనిషి గల్తీ అయిపోతున్నాడంటూ ఆవేదన స్వరాన్ని వినిపించారు.

‘కళ్లు మూసి కలల కిటికీ తెరిచి/ రాత్రంతా బొర్లినా నిద్ర అసలే దయ చూపడం లేదు’ అంటూ, ‘భూకంపంలో కాళ్ల కింద నేల కూలిపోతుంటే/ కవరేజ్ లేని ఏరియాలో సిగ్నల్స్ అందవు’ అంటూ ఒక కవితలో చమత్కరించారు. ‘నువ్వు లేని నాలుగు రోజులు నీళ్లు పోయని/ మొక్కలా వడలిపోయాను/ నీరు లేని నదిలా బావురుమంటున్నాను/ నీ రాక ఆరు రుతువులు ఒకేసారి గృహప్రవేశం చేస్తాయి’ వంటి బలమైన భావోద్వేగపు పంక్తులు పుస్తకం నిండా ఉన్నాయి. ‘మనో సముద్రంలో సుడిగుండం/ తుఫాన్ అయి తీరాన్ని పొద్దున నిండిన స్త్రీ మాదిరి భారంగా దాటలేకపోతున్నా’ అంటూ ఒక కవితలో ఆవిష్కరించారు.

‘దుక్కి దున్నిన తడిసిన నేల విత్తనాలు నాటడానికి సిద్ధంగా ఉంది/ ప్రకృతిని లొంగ తీసుకోవాలనే మనిషి తాపత్రయం/ మనిషిని అదుపు చేయాలనే ప్రకృతి సహజ ధర్మం/ రెండింటినీ పరస్పర విరుద్ధ పరిణామ శత్రువులుగా మార్చారు’ అంటారు మరో కవితలో. టీ పెట్టుకున్న గిన్నెలు కప్పులతో సింక్ నిండిపోవడాన్ని ‘ఆమె లేని ఇల్లుగా’ అభివ్యక్తీకరించారు. రాముని కాలు తగిలి రాయి అహల్య అయ్యిందో లేదో గానీ, ఇప్పుడు నీ స్పర్శతో ఇల్లు జీవ కళతో ఉట్టిపడుతుందంటూ స్త్రీ ప్రేమపై కైత కుమ్మరించారు. వంద చందమామలు, సిమ్‌గానం, టేబుల్ నాలుగు కుర్చీలు, నరం లేని నాలిక, ఇరుసు, పెంపుడు జంతువు, ముద్దాడాలని ఉంది, మేకప్.. వంటి విభిన్న శీర్షికలతో ఉన్న కవితలు సైతం పుస్తకంలో ఉన్నాయి.

కొత్త పద బంధాలు, ఆధునిక మాటలు చాలానే ఉన్నప్పటికీ, సామాన్య పాఠకుల హృదయాల్లో కవి ఆలోచనలు బలమైన ముద్ర వేసుకుంటాయి. ఏడు దశాబ్దాల జీవన సారాన్ని ఐదు దశాబ్దాల సాహితీ విశ్వాన్ని రంగరించి ‘మనాది‘ ని ముఫ్ఫు రంగుల అందమైన కవనాక్షర ఇంద్రధనస్సును సాహితీ వినీలాకాశంలో సృష్టించారు కవి. వారు నమ్మిన సిద్ధాంతాలు ఏమైనప్పటికీ, జీవితంలోని భిన్న దృక్పథాలు, సగటు సామాన్య మనిషి సమస్యల పరిష్కారాలు, కొన్ని సందర్భాల్లో అందమైన భావ కవిత్వపు ఆనవాళ్లను కలగలిపే ముఖచిత్రంతో వచ్చిన పుస్తకం ‘మనాది’. వారు ఇంకా ఎన్నో పుస్తకాలు పాఠకులకు అందించాలని, తద్వారా తెలుగు సాహితీ లోకంలో మరిన్ని అక్షర ముద్రలు వేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 

(ప్రతులకు సంప్రదించాల్సిన 

ఫోన్ నంబర్: 94410 78095)

కవి: జూకంటి జగన్నాథం

సమీక్షకుడు: ఫిజిక్స్ 

అరుణ్‌కుమార్