calender_icon.png 5 July, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ అధ్యక్ష పీఠం ఈసారి మహిళకే!

05-07-2025 01:58:14 AM

  1. జోరుగా ఊహాగానాలు

జాతీయ అధ్యక్ష పదవి రేసులో నిర్మలా సీతారామన్, పురందేశ్వరి, వానతీ శ్రీనివాసన్

రాష్ట్రాల్లో కొనసాగుతున్న సంస్థాగత ఎన్నికలు

న్యూఢిల్లీ, జూలై 4: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఈసారి మహిళలకు వచ్చే అవకాశముందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రేసులో బీజేపీకి చెందిన ముగ్గురు మహిళల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధ్యక్ష పదవి రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఏపీ బీజేపీ ఎంపీ పురం దేశ్వరి, తమిళనాడు ఎమ్మెల్యే వానతీ శ్రీనివాస్ ఉన్నారు.

మహిళా సాధికారతకు మరింత ఊతమిచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం మహిళను పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జేపీ నడ్డా జాతీయాధ్యక్షుడి వ్యవహరిస్తున్నారు. వరుసగా రెండో సారి ఆయన ఈ పదవిని చేపట్టి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించారు. జేపీ నడ్డా వారసుల కోసం పార్టీ తీవ్రంగా అన్వేషణ ప్రారంభించింది.

ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సమర్ధులైన నాయకుల కోసం కాషాయ నేతలు తీవ్రంగా జల్లెడ పట్టారు. జాతీయ అధ్యక్షుడిని నియమించేందుకు దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి ఉండాలనే బీజేపీ నిబంధనల మేరకు ఇప్పటికే 16 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు.  

నిర్మలా సీతారామన్

బీజేపీ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందు వరుసలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీలో అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఆమె ఒకరు. తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకునే నిర్మలా బీజేపీని ముందుండి నడిపించగలరని అందరి నమ్మకం. మోదీ ప్రభుత్వంలో..

2019లో తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  ఆమె అప్పటి  నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. తమిళనాడులో జన్మించిన నిర్మలా సీతారామన్.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పరకాల ప్రభాకర్‌ను వివాహం చేసుకుంది. దేశంలో పూర్తి స్థాయి తొలి ఆర్థిక మంత్రిగా రికార్డులకెక్కిన నిర్మలమ్మకు జాతీయ పగ్గాలు ఇస్తే పార్టీని మరో స్థాయికి తీసుకెళ్లుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

పురందేశ్వరి

రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. కొద్ది రోజుల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన పురందేశ్వరి.. రాష్ట్ర విభజన అనంతరం కాషాయ కండువా కప్పుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచి సత్తా చాటారు. పురందేశ్వరికి కూడా అధ్యక్ష పగ్గాలు అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మొన్నటి వరకు సేవలందించారు. ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాల్లోని ఓ బృందానికి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

వానతీ శ్రీనివాసన్

తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 1983లో బీజేపీ తీర్థం పుచ్చుకున్న శ్రీనివాసన్ అంచెలంచెలుగా ఎదిగారు. 2021 ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, సినీనటుడు కమల్‌హసన్‌ను ఓడించి శ్రీనివాసన్ కోయంబత్తూర్ ఎమ్మెల్యేగా గెలిచారు.

శ్రీనివాసన్ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాలి పదవికి ముందు వరుసలో ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో అధ్యక్షురాలిగా ఎవరు ఎంపికైనా ఇన్నేళ్ల బీజేపీ పార్టీకి తొలి మహిళా జాతీయ అధ్యక్షురాలుగా నిలవడం ఖాయం.