26 August, 2026 | 7:36 AM

ఆ 50 ఎకరాలు భూదాన బోర్డువే!

14-03-2025 01:52 AM
  1. హైకోర్టుకు నివేదించిన రాష్ట్రప్రభుత్వం
  2. విచారణ ఏప్రిల్‌కు వాయిదా

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్లు 181, 182లోని దాదాపు 50 ఎకరాల భూమి భూదాన బోర్డుకు చెందినవేనని రాష్ట్రప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఈ మొత్తం వ్యవహారంపై సుమోటోగా తీసుకుని భూదానబోర్డు విచారణ చేపడుతున్నదని, దీనిపై విచారణ పూర్తయిందని, తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉన్నందున పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల గడువు కావాలని కోరింది. 

భూమికి సంబంధించి ఖాదర్ ఉన్నీసాకు వారసత్వ ధ్రువీకరణపత్రం జారీ చేసిన అప్పటి కలెక్టర్ అమోయ్‌కుమార్, డీఆర్వో జ్యోతిపై చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదును బేఖాతరు చేయడాన్ని సవాల్ చేస్తూ నవాబ్ ఫరూహ్‌ఖాన్ గతంలో హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌పై నివేదిక సమర్పించాలంటూ న్యాయస్థానం ప్రభుత్వ సీఎస్‌ను ఆదేశించింది.

దీంతో  భూదాన బోర్డు కాంపిటెంట్ అథారిటీ అధికారిగా రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు. భూయజమాని మహమ్మద్ హజీఖాన్ దశాబ్దాల క్రితం 103.22 ఎకరాల భూమిలో 50 ఎకరాలను భూదాన్ బోర్డుకు విరాళంగా ఇచ్చారని సమాధానమిచ్చారు.

పట్టాదారు నుంచి బోర్డు భూమిని విరాళంగా పొందిన తర్వాత రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేయలేదని, దీంతో కొందరు భూమిపై లావాదేవీలు నిర్వహించారని తెలిపారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపడుతున్నామని, పూర్తి వివరాల సమర్పణకు మరో రెండు వారాల గడువు కోవాలని కోరారు. దీంతో కోర్టు విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.