calender_icon.png 8 December, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ బలపరిచిన వారిని సర్పంచ్‌లుగా గెలిపించాలి

08-12-2025 12:31:52 AM

మాజీ ఎమ్మెల్యే విస్తృత ప్రచారం 

మహబూబాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తొలి విడత నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. పెనుగొండ, బేరువాడ, రంగాపురం, అర్పణ పల్లి, కాట్రపల్లి, భవాని గడ్డ తండా, ఇంటి కన్నే, వెంకటగిరి, కల్వల, గాంధీనగర్, తాళ్లపూస పల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీల్లో ఏవి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని, పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలనలో ప్రజలంతా ప్రశాంతంగా శాంతియుతంగా జీవనం సాగించారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆరోపించారు.

అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని, తమ పార్టీ నేతలను బెదిరింపులకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం పై విరక్తితో ఉన్నారని, పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను బీఆర్‌ఎస్ మద్దతిచ్చిన వారు గెలవడం తధ్యమని చెప్పారు.