13-11-2025 12:56:05 AM
ముగ్గురు మంత్రులది ఎవరిదారి వారిదే!
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 12 (విజయక్రాంతి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి బలమైన పట్టుంది. నిబద్ధత కలిగిన కార్యకర్తలతో ప్రతి ఎన్ని కలలో తిరుగులేని విజయంతో ప్రతిపక్షాలను మట్టికరిపించింది. రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలకు గాను 9 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
రెండోసారి జరిగిన ఎన్నికల్లోను అదే ఫలితాలు వచ్చాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాలు, సీపీఐ ఒక స్థానం, బీఆర్‌ఎస్ ఒక స్థానంలో గెలిచాయి. దీంతో ఏ జిల్లాకు లేనట్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. వీరికి తోడు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా రామ్ సహాయం రఘురామిరెడ్డి, మరో ఎంపీ రేణుకా చౌదరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రిగా పొంగులేటికి పదవులు లభించాయి. ముగ్గురు ఉంటే ముడిపడదు.. నలుగురు ఉన్న చోట కర్ర విరగదు, పాము చావదు అన్నచందంగా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
తమ నియోజకవర్గాల్లో పర్యటనలతో పాటు.. ముగ్గురు మంత్రులు మూడు క్యాంపులు ఏర్పాటు చేసుకొని వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నారని, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం.. సంజీవరెడ్డి భవన్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరుపై విజయక్రాంతి ప్రత్యేక కథనం..
ముగ్గురూ మంత్రులు కలిసి జిల్లాను గొప్పగా అభివృద్ధి చేస్తారని అందరూ భావించారు. అయితే, అభివృద్ధి మాట అటుంచి, నేతల మధ్య సర్దుబాటు చేయలేనంత అంతరం ఏర్పడిందని పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సీతారామ సాగర్ మినహా, కొత్తగా జిల్లాకు తీసుకువచ్చిన ప్రాజెక్టులు ఏమీలేవని విమర్శలు వినిపిస్తున్నాయి. ముగ్గురు మంత్రులు మూడు ప్రాంతాలపై దృష్టి పెట్టి తలా ఓ పని చేపట్టినా జిల్లా ఇప్పటికే కండ్లు చెదిరే స్థాయిలో అభివృద్ధి చెందిఉండేదనే వాదనలు ఉన్నాయి.
ఎవరికి వారు పై చెయ్యి సాధించేందుకు పోటీ పడుతున్నారే తప్ప కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకువచ్చి జిల్లాను అభివృద్ధి చేసిన దాఖలాలు కానరావడం లేదని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. మంత్రులకు క్యాంపు కార్యాలయాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వలస కాంగ్రెస్ నేతలకు, ప్రజా ప్రతినిధులకు మాత్రమే అపాయిమెంట్స్ ఇస్తున్నారని.. ఉమ్మడిగా మంత్రుల పేరుతో కలిపి ఫ్లెక్సీలు కూడా వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
పాత నేతలకు మొండిచెయ్యి..
జిల్లాలో కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పదవులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఇవి భర్తీ కావడం లేదు. దీంతో దిగువశ్రేణి నాయకత్వంలో ఆవేదన కనిపిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భద్రాచలం దేవ స్థానానికి ప్రత్యేక బోర్డు నియమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నేతలు చైర్మన్ పదవి మీద, బోర్డు సభ్యుల పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు.
భద్రాచలంతో పాటు మరో 16 దేవస్థానాలు ఉన్నాయి. వీటికి కూడా ఇప్పటివరకు పాలక బోర్డులు లేవు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండళ్ల కార్యవర్గాన్ని నియమిస్తారని నెలలుగా ప్రచారం జరుగుతున్నది. కానీ ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన భద్రాచలం ట్రస్టు బోర్డు, సుడా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మ న్ పదవులను ముగ్గురు మంత్రుల పోటీ కారణంగా వాయిదాపడుతున్నాయి.
పార్టీ జెండాలు మోసి, వారిని గెలిపించేందుకు తాము కావాలని కానీ, పదవుల పంపకాలకు వచ్చేసరికి వర్గ పోరుతో తమను పక్కన పెడుతున్నారని కార్యకర్తను ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా పదవులు భర్తీ చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా మూడు కీలక శాఖలను నిర్వహిస్తున్న ముగ్గురు మంత్రులు.. పదేపదే అభివృద్ధి జపం చేసేవాళ్ళు కలిసి నడిస్తే ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, కార్యకర్తలు కోరుతున్నారు. అయితే ముగ్గురు మంత్రులు సఖ్యతతో జిల్లాను అభివృద్ధి నడిపిస్తారా అనేది వేచి చూడాల్సిందే.
ఎవరి వర్గం వారిదే!
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక కుర్చీ అరడజన్ మంది నేతలుగా పోటీ మారింది. ఇప్పటికే నాయకుల మధ్య ఉన్న వర్గపోరుకు తోడు డీసీసీ ఎంపిక మళ్లీ జిల్లా కాంగ్రెస్ రాజకీయ వేడిని పెంచేస్తోంది. తన మనిషే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని మంత్రులు పట్టుపడుతున్నారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా భట్టి వర్గానికి చెందిన నూతి సత్యనారాయణ, వేమిరెడ్డి శ్రీనివాస్‌లో ఒక్కరి పేరు ఖరారు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ భట్టి వర్గానికి చెందిన నేత. ఆయనను డీసీసీ నుంచి తప్పిస్తే అదే వర్గానికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నాగసీతారాములు, మోత్కూరి ధర్మరావు, ఎడవల్లి క్రిష్ణ, శౌరి, ఏలూరి కోటేశ్వర్ రావు, నల్లపు దుర్గాప్రసాద్, చందా సంతోష్ కుమార్, రేసులో ఉన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు ఉన్నందున అదే సామాజికవర్గానికి చెందిన పోదెం వీరయ్యనే మళ్లీ కొనసాగించే అవకాశం ఉంది. డీసీసీ అధ్యక్షులుగా మళ్లీ భట్టి వర్గానికే అవకాశం దక్కితే.. జడ్పీ ఛైర్మన్ పదవి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి, డీసీసీబీ చైర్మన్ పదవి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులకు దక్కేలా ముగ్గురు మంత్రులు మూడు కీలక పదవులు పంచుకున్నట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతున్నది.