13-11-2025 01:07:39 AM
ప్రైవేట్ పంచాయితీలను ఆశ్రయిస్తున్న బాధితులు
హైదరాబాద్, నవంబర్ ౧౨ (విజయక్రాం తి): రాజ్యాంగ బద్ధంగా రూపుదిద్దుకున్న వ్యవస్థలన్నీ ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నాయి. అలాంటి వ్యవస్థల్లో న్యాయ వ్యవ స్థ ఎంతో కీలకం. అయితే పోలీస్ శాఖ కార్యనిర్వాహక వ్యవస్థ అయినప్పటికీ ప్రజలకు న్యాయం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. నేరాలను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో పోలీస్ శాఖ కృషి చేస్తుంది.
పోలీసు శాఖ నేరస్థులను గుర్తించి న్యాయస్థానంలో ప్రవేశపెడితే అక్కడ విచారణ జరిపి వారికి తగిన శిక్షను న్యాయవ్యవస్థ అమలుపరుస్తుంది. అయితే ఈ ప్రక్రియలో లోపాలు, నిర్లక్ష్యం ధోరణి వంటి అనేక కారణాలతో ప్రజలకు తగిన న్యాయం జరగడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. న్యాయవ్యవస్థతో ఎలాంటి ఉపశమనం పొందని పరిస్థితుల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఏ చెట్టు లేని దగ్గర ఆముదం చెట్టే మహావృక్షం అన్న చందానా గుండాలు, సెటిల్‌మెంట్లు చేసే వ్యక్తులు తమ దందాలు చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. న్యాయస్థానాలు, పోలీసుల ద్వారా న్యాయం లభించక విసిగిపోయిన ప్రజలు కూడా చివరకు చేసేదేమీ లేక గుండాలు చేసే పంచాయితీలనే నమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. న్యాయం దొరకని చోట గూండాలే న్యాయమూర్తులు అవుతున్నారు.
పోలీస్ స్టేషన్లు చూసిచూడనట్టు వ్యవహరించడం, కోర్టులు నిద్రావస్థలో ఉంటున్నాయి. ఫలితంగా గ్రామాల నుంచి నగరాల దాకా అంతటా గూండా దర్బార్‌లే ప్రజలకు ఆశ్రయం అవుతున్నాయి. ఈ పరిస్థితులపై విజ్ఞులైన ప్రతిఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. న్యాయం కోసం ప్రజలు గూండాల దగ్గరకి ఎందుకు పరుగెడుతున్నారో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఈ కోవలో కొన్ని ఉదాహరణలు నల్లగొండలో రైతు భూమి సమస్య..
నల్లగొండ జిల్లా గ్రామీణ ప్రాంతంలో యాదగిరి గౌడ్ అనే రైతు ఇరవై సంవత్సరాలుగా న్యాయం కోసం తిప్పలు పడుతున్నా డు. అతని 20 ఎకరాలు 3 గుంటల సాగు భూమే ఆయన కుటుంబానికి జీవనాధారం. అయితే 2005లో నరసింహ పటేల్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజకీయ పలకుబడి, అధికారుల ప్రోద్బలంతో యాదగిరి గౌడ్ భూమిని కాజేశాడు. 62 ఏళ్ల యాదగిరి మొదట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి పిర్యాదులు వేసినా ఫలితం లేదు.
యాదగిరి చేసిన ఫిర్యాదు ఫైళ్లు మూలకు పడిపోయా యి. కోర్టులో కేసు పెట్టినా పటేల్ న్యాయవాదులు వాయిదాలతో ఏళ్ల తరబడి జాప్యం చేశారు. దీంతో యాదగిరి గౌడ్ తనకున్న ట్రాక్టర్ అమ్మేయంతోపాటు బంగారాన్ని కుదువా పెట్టాడు. అతని సమస్యపై కలెక్టర్ దగ్గర వేడుకున్నా న్యాయం జరగలేదు. చివరికి నిరాశ యాదగిరిని మల్లేశ్ యాదవ్ అనే గూండా దగ్గరకు తీసుకెళ్లింది.
ఈ క్రమంలో యాదగిరి సమస్యను మల్లేష్ యాదవ్ పదిహేను రోజుల్లో సెటిల్ చేశాడు. సమస్యను పరిష్కరించినందుకుగానూ తన వాటా కింద భూమిలో 10 శాతం, ఒక లక్ష రూపాయలను మల్లేష్ తీసుకున్నాడు అని యాదగిరి వివరించాడు.
వరంగల్‌లో పొచవ్వ కుటుంబ సమస్య..
55 ఏళ్ల పొచవ్వ తన కుమార్తె లక్ష్మీకి 2023లో పెళ్లి చేసింది. కానీ పెళ్లి తర్వాత కొన్ని వారాల్లోనే అల్లుడు కుటుంబం రూ. 5 లక్షల అదనపు కట్నం, భూమిలో వాటా అడిగింది. వేధింపులు మొదలయ్యాయి. చివరికి లక్ష్మీ గాయాలతో పోచవ్వ ఇంటికి చేరింది. ఆమె ఆరుసార్లు పోలీస్ స్టేషన్ వెళ్లింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు. చివరికి చేసేదేమీ లేక పొచవ్వ చోటా పహిల్వాన్ అనే గూండా దగ్గరకి వెళ్లింది.
చోటా పహిల్వాన్ పల్లె దర్బార్ నిర్వహించడం ద్వారా వివాదాలు పరిష్కరించి ఫీజు కింద రూ.50 వేలు తీసుకుంటాడు. ఒక నెలలోనే పహల్వా న్ రెండు కుటుంబాలను గోదాములోకి పిలిపించాడు. భయంతో అల్లుడు కుటుంబం కట్నం తిరిగి ఇచ్చి, భూమిపై హక్కు వదిలేసింది. దీనిపై పోచవ్వ స్పందిస్తూ పోలీసులు చేయలేని పని చోటా పహిల్వాన్ చేశాడని, డబ్బులు పోయినా కన్నీళ్ల కంటే విలువైనవి కాదు కదా అని చెప్పింది.
బంజారాహిల్స్‌లో పెద్దమనిషి కేసు...
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్‌ఆర్ రావు తన ఉద్యోగ కాలంలో కోట్ల రూపాయల బ్లాక్ మనీ సంపాదించాడు. వాటిలో 2 కోట్లు అతని స్నేహితుడు రవికుమార్ వద్ద పెట్టాడు. కానీ రిటైర్ అయి నాక రవి నష్టం జరిగిందంటూ డబ్బు తిరిగి ఇవ్వలేదు. కోర్టుకు లేదా పోలీసులకు వెళ్లే పరిస్థితి లేని రావు బొక్క రాజు అనే మాజీ రౌడీని సంప్రదించాడు.
రాజు 20 శాతం కమీషన్‌తో వారంలో పని పూర్తవుతుందని హామీ ఇచ్చాడు. బెదిరింపులు, అర్ధరాత్రి రైడ్లు, ఫోన్ కాల్స్ వంటి ప్రదర్శించి వారం రోజుల్లో రావు డబ్బు తిరిగి ఇప్పించాడు. కానీ రాజు వాటా తీసుకున్నాడు.
వ్యవస్థల వైఫల్యం.. బాధితులకు వీధిలో న్యాయం
ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చట్టం, అధికారులు, పోలీసులు, మీడియా వంటి వ్యవస్థల నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు గుండా దర్బార్‌ల వైపు పరుగెడుతున్నారు. తెలంగాణలో గత సంవత్సరం లోకాయుక్త 1200 అవినీతి కేసులు పరిశీలించి రూ. 15 కోట్లు రికవరీ చేసింది. కానీ తీర్పులు రావడానికి 18 నెలలు, అమలుకు ఏళ్లు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు గూండాలను ఆశ్రయించకుండా ఏం చేస్తారు. ప్రస్తుతం పల్లెల్లో నూ, పట్టణాల్లోనూ ‘గూండా దర్బార్’లే ప్రజలకు చివరి ఆశగా కన్పిస్తున్నాయి.
కొంత ఖర్చు అయినప్పటికీ సమస్య మాత్రం వారంలోపే ఫలితం వస్తుంది. సమస్యల పరిష్కారం జాప్యమవుతున్న నేపథ్యంలో ప్రజలు న్యాయం కంటే ఫలితాన్ని కోరుకుంటున్నారని స్పష్టమవు తున్నది. అందుకే గుండా దర్బార్‌లను కూడా లీగల్ చేయాలని వ్యంగ్యంగా అం టున్నారు. లోక్ అదాలత్ పక్కన గూండా అదాలత్ పెట్టాలని, కనీసం కేసులు దీపావళికల్లా క్లియర్ అవుతాయని వ్యవస్థలను ఎద్దేవా చేస్తున్నారు.
అయితే గుండా దర్బార్‌లను ఆశ్రయించిన యాదగిరిగౌడ్ తన భూమిని తిరిగి సాగు చేస్తున్నాడు. పోచవ్వ తన కూతురి జీవితం సాఫీగా సాగుతున్నది. కేఎస్‌ఆర్ తన పాత డబ్బు లెక్కలు వేసుకుంటున్నాడు. కానీ ఇంకా ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంలో ప్రజలు తమ హక్కుల కోసం గూండాలను ఆశ్రయించాల్సిందే నా?.
రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన న్యాయం ప్రజలకు ఇంత దూరంగా ఉం టుందా?. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ సంస్కరణలు, డిజిటల్ కోర్టులు, చురు కైన మీడియా ఎంతో అవసరం. అప్పటి వరకు ప్రజలు దర్బార్లను వెతుక్కుంటూనే వెళతారు.